Uttam Kumar Reddy: మైలారం నుంచి సుందిళ్లకు టన్నెల్
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:18 AM
ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పునరుద్ధరణ పనులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు....
ఖర్చు తగ్గేలా ప్రాణ హిత-చేవెళ్ల పునరుద్ధరణ.. 1500 కోట్ల వరకూ ఆదా! .. సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కోసం హెలికాప్టర్‌తో జియో మ్యాగ్నటిక్ సర్వే
అధికారులకు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి పునరుద్ధరణ పనులు తక్కువ ఖర్చుతో పూర్తయ్యేలా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో.. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే... 71.5కి.మీ.ల దాకా (మైలారం గ్రామం వరకూ) గ్రావిటీతో నీరు చేరుతుందని, ఆ నీటిని ఎల్లంపల్లికి పంపింగ్ చేయాలంటే 30 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 12మోటార్లతో పంపింగ్ స్టేషన్‌ను నిర్మించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. అలైన్‌మెంట్ మంచిర్యాల నుంచి వెళ్లనుండటంతో భూసేకరణకు భారీగా నిధులు అవసరమవుతాయని తెలిపారు. అలాకాకుండా మైలారం నుంచి సుందిళ్లకు నీటిని నేరుగా గ్రావిటీతో తరలించవచ్చని, సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతులు చేసుకుంటే ఇప్పటికే సిద్ధంగా ఉన్న పంప్‌హౌ్‌సను వినియోగించుకోవచ్చని గుర్తు చేశారు. దీనికోసం 20.6 కి.మీ.ల మేర టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత నీటిని టేకుమట్ల వాగులో వేస్తే నేరుగా సుందిళ్లకు చేరుతాయని, అక్కడి నుంచి నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చన్నారు. ఈ అలైన్‌మెంట్‌తో ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 10-12 శాతం తగ్గుతుందని, భూసేకరణ సగానికి పైగా తగ్గుతుందని తెలిపారు. ఫలితంగా రూ.1500-1600 కోట్ల దాకా ఆదా చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొనగా.. దీనిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రికి ఈ ప్రతిపాదన గురించి నివేదించి, ఆయన అనుమతి అనంతరం సవరించిన డీపీఆర్‌పై మంత్రివర్గంలో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీని కడితే గ్రావిటీతో నీటిని తరలించలేం కాబట్టి, 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ కట్టడానికి వీలుగా మహారాష్ట్ర అనుమతి తీసుకుందామన్నారు. మరోవైపు, సమ్మక్కసాగర్ బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్ అనుమతి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ కార్యదర్శిని సమ్మక్కసాగర్ బ్యారేజీ పరిశీలన కోసం ఆహ్వానించాలన్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ తవ్వకానికి వీలుగా హెలికాప్టర్‌తో జియో మ్యాగ్నటిక్ సర్వేను చేపట్టాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బ్యారేజీ, కాళేశ్వరం డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు నిధులు, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై కూడా సమీక్ష సమావేశంలో చర్చించారు.
ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోవొద్దు!
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని.. అవినీతి ఆరోపణలు వస్తే అధికారులు, రైస్ మిల్లర్లపైకఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు నష్టం కలిగితే చూస్తూ ఊరుకోబోదన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మొంథా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోనూ ఉంటే అప్రమత్తంగా వ్యవహరించాలని, ధాన్యంతోపాటు మొక్కజొన్న, ఇతర పంట ఉత్పత్తులు దెబ్బ తినకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.