Share News

Thungathurthi MLA Samuel: మదర్‌ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌‌తో పొత్తా?

ABN , Publish Date - Sep 27 , 2025 | 03:35 AM

మదర్‌ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకున్నారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

Thungathurthi MLA Samuel: మదర్‌ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌‌తో పొత్తా?

  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌

  • కాంగ్రెస్‌ ఓడితే అయిలయ్యదే బాధ్యత

  • బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకుంటారా ? అంటూ..

  • డీసీసీ అధ్యక్షుడు, మదర్‌ డెయిరీ చైర్మన్‌పై ఫైర్‌

యాదాద్రి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మదర్‌ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకున్నారంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మదర్‌ డెయిరీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సామేల్‌.. భువనగిరిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఓ డీసీసీ అధ్యక్షుడు, మదర్‌ డెయిరీ చైర్మన్‌ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకునే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ? మండిపడ్డారు. ఏఐసీసీ, టీపీసీసీ, ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయా ? అని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు, చైర్మన్‌కు బీఆర్‌ఎస్‌ నేతలతో బంధుత్వం ఉంటే అది వ్యక్తిగతంగా చూసుకోవాలని సూచించారు. అలా కాకుండా అక్రమంగా పొత్తు పెట్టుకుని బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇస్తే అది రాజకీయ వ్యభిచారం చేస్తున్నట్టేనని విమర్శించారు. 11 ఎమ్మెల్యే, రెండు, ఎంపీ స్థానాలు గెలుచుకుని జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందన్నారు. ఎవరి మీద కొట్లాడి గెలిచి అధికారంలోకి వచ్చామో వారితో కలిసి రాజకీయాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అందరి విజయం కోసం అధిష్ఠానం, సీఎం రేవంత్‌ కృషి చేస్తే మీరు చేసే పని ఇదా ? అంటూ మండిపడ్డారు. అన్ని విషయాలు తెలిసినా ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో మెత్తం 311మంది పాల సంఘాల చైర్మన్లకు ఆలేరు నియోజకవర్గంలోనే 110మంది ఉన్నారని తెలిపారు. గెలుపు ఓటములు బీర్ల అయిలయ్య చేతిలో ఉన్నాయన్నారు. అందువల్ల ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతే అయిలయ్య బాధ్యత తీసుకోని రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని బొందపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. శనివారం జరిగే మదర్‌ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని దండం పెడుతున్నానని అన్నారు. ఎవరూ ప్రలోభాలకు గురి కాకుండా, ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


ప్రెస్‌ మీట్‌లో ఉండగానే టీపీసీసీ చీఫ్‌ ఫోన్‌

ఎమ్మెల్యే సామేల్‌ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగా టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ ఆయనకు ఫోన్‌ చేశారు. మదర్‌ డెయిరీ ఎన్నికల్లో పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. స్థానికంగా ఉన్న కొందరు నేతలు బీఆర్‌ఎ్‌సకు మద్దతు తెలియజేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని తాను తీవ్రంగా పరిగణిస్తున్నానని, అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Updated Date - Sep 27 , 2025 | 03:35 AM