Tummla Nagashwar Rao: సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:31 AM
జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్రంతో మాట్లాడా: తుమ్మల
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలు తమకు నష్టాలు కలిగించే విధంగా ఉన్నాయని, తాము పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తామని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు హెచ్చరించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. సమస్యలపై కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కార్యాలయ అధికారులతో మాట్లాడానని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేవిధంగా కృషి చేయాలని, మిల్లులను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరానని పేర్కొన్నారు. సీసీఐ విధించిన ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని ఎత్తివేసి, ఎకరానికి 12 క్వింటాళ్ల పరిమితితో కొనుగోళ్లు జరిపేలా చొరవ తీసుకోవాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లానన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని సమ్మె ఆలోచనలు విరమించాలని ఆయన సూచించారు.