Share News

TTD Announces Online Token Booking: తొలి మూడు రోజులూ ఈ డిప్‌లోనే

ABN , Publish Date - Nov 19 , 2025 | 05:17 AM

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడురోజులకు టోకెన్లను ఆన్‌లైన్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజులూ టోకెన్లను ఈ-డిప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు...

TTD Announces Online Token Booking: తొలి మూడు రోజులూ ఈ డిప్‌లోనే

  • మిగిలిన ఏడు రోజులూ నేరుగా దర్శనాలు

  • డిసెంబరు 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు

  • టీటీడీ బోర్డు నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్‌

తిరుమల, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడురోజులకు టోకెన్లను ఆన్‌లైన్‌లో కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు రోజులూ టోకెన్లను ఈ-డిప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు. మిగిలిన ఏడు రోజులూ భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు. ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులతో కలిసి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు పదిరోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. గతంలో తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేసే కౌంటర్లలో ముందు రోజు నుంచీ వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్లు కేటాయించేవారు. తొలి రెండు రోజుల టికెట్ల కోసం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. గతేడాది తిరుపతి బైరాగిపట్టెడ కౌంటర్ల వద్ద క్యూలైన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంతో ఈసారి అటువంటి సంఘటనలకు తావీయకుండా ఆన్‌లైన్‌లోనే తొలి మూడు రోజుల టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు.


సామాన్యులకు అధిక ప్రాధాన్యం

సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి సామాన్య భక్తులకే వైకుంఠ ద్వార దర్శనాల్లో పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నట్టు బీఆర్‌ నాయుడు తెలిపారు. పదిరోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనాలకు 182 గంటల సమయం ఉంటుందని, అందులో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ పదిరోజుల్లో దాదాపు 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. గంటకు 4,300 నుంచి 4,700 మందికి దర్శనం చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. తొలి మూడు రోజుల దర్శనాల టోకెన్ల కోసం భక్తులు నవంబరు 27 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు టీటీడీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌, వాట్సాప్‌ ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్‌, హిందీ భాషల్లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. డిసెంబరు 2న డిప్‌లో ఎంపికైన వారికి సమాచారాన్ని పంపుతారు. తొలి మూడురోజులు దర్శన టోకెన్లు ఉన్నవారు మాత్రమే తిరుమలకు రావాలని చైర్మన్‌ విజ్ఞప్తి చేశారు. కాగా.. అమరావతిలోని శ్రీవారి ఆలయం రెండో ప్రాకార నిర్మాణానికి సీఎం చేతుల మీదుగా ఈ నెల 27వ తేదీన భూమి పూజ జరుగుతుందని తెలిపారు.

బోర్డు నిర్ణయాలు

  • వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడురోజులూ శ్రీవాణితో పాటు, రూ.300 ప్రత్యేక దర్శనాలు రద్దు

  • పది రోజుల పాటు ఆర్జితసేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.స్వయంగా వచ్చే ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ దర్శనాలు

  • వాట్సాప్‌ ద్వారా టోకెన్లు బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేక అప్షన్లు అందుబాటులోకి తెచ్చి సులువుగా నమోదు చేసుకునేలా ఏర్పాట్లు

  • వైకుంఠ ఏకాదశి రోజున 70 వేలు, ద్వాదశి రోజున 75 వేలు, ఆంగ్ల సంవత్సరం తొలి రోజు 68 వేల మందికి దర్శనం అవకాశం

  • జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు రూ.300 టికెట్లు 15 వేలు, శ్రీవాణి ట్రస్టు దాతలకు వెయ్యి చొప్పున టికెట్లు కేటాయిస్తూ నిర్ణయం.

Updated Date - Nov 19 , 2025 | 05:17 AM