TSRTC Plans Smart Cards: మహాలక్ష్మి ఆర్టీసీ ప్రయాణానికి స్మార్ట్ కార్డు
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:53 AM
రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందుతున్న మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో....
కొత్త ఏడాది ప్రారంభంలో జారీకి సంస్థ కసరత్తు
హైదరాబాద్, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని పొందుతున్న మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. తెలంగాణలో మహాలక్ష్మి పథకంతో అతివలు రెండేళ్లలో 251 కోట్ల ప్రయాణాలు చేశారు. వీటి విలువ రూ.8,500 కోట్లు. ప్రయాణ సమయంలో మహిళలు తమ వెంట ఆధార్ కార్డు తీసుకు రావాల్సి ఉంది. కార్డు లేకపోతే టికెట్ తీసుకోవాల్సిందే. అయితే, గుర్తింపు కార్డు కాకుండా ఢిల్లీలో మహిళలకు అందించిన ‘సహేలీ’ తరహా స్మార్ట్ కార్డులు వాడుకలోకి తెచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. 2026 ప్రారంభంలోనే వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఢిల్లీలోని స్మార్ట్ కార్డు విధానంపై అధికారులు ఇదివరకే అధ్యయనం చేశారు. ముందుగా అనుకున్న ప్రకారం 2025లోనే స్మార్ట్ కార్డు ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగింది. దీంతో కొత్త ఏడాది ప్రారంభంలోనే స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. స్మార్డు కార్డుపై లబ్ధిదారు ఫొటో, పేరు, చిరునామా ఉంటుంది. మరోవైపు, విద్యార్థుల బస్ పాస్‌లను సైతం స్మార్ట్ కార్డుల్లోకి బదలాయించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలో ఈ కార్డులను హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రాయితీలపై ప్రయాణం చేసే వారికి సైతం స్మార్ట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.