Share News

TSPSC: ఇక గ్రూప్‌-2, 3 భర్తీపై దృష్టి

ABN , Publish Date - Sep 26 , 2025 | 06:51 AM

గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1ను కేవలం 19నెలల్లోనే పూర్తిచేసిన టీజీపీఎస్సీ..

TSPSC: ఇక గ్రూప్‌-2, 3 భర్తీపై దృష్టి

  • 19 నెలల్లోనే గ్రూప్‌-1 ప్రక్రియను పూర్తిచేసిన టీజీపీఎస్సీ

  • గత 40 ఏళ్లలోనే అత్యంత తక్కువ వ్యవధిలో భర్తీ

  • గ్రూప్‌-2లో 783 పోస్టులు, గ్రూప్‌-3లో 1365

  • ఇప్పటికే పూర్తైన పరీక్షలు, ఫలితాల వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 నియామకాల ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1ను కేవలం 19నెలల్లోనే పూర్తిచేసిన టీజీపీఎస్సీ.. తాజాగా గ్రూప్‌-2, గ్రూప్‌-3 నియామక ప్రక్రియనూ పూర్తిచేయడంపై దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా గత 40 ఏళ్లలో మొత్తం ఐదుసార్లు గ్రూప్‌-1 పరీక్ష నిర్వహించగా అత్యంత తక్కువ సమయంలో ప్రక్రియ పూర్తయిన సందర్భం ఇదే. వాస్తవానికి గ్రూప్‌-1 నియామక ప్రక్రియ పూర్తయ్యాకే భర్తీ చేస్తే బ్యాక్‌లాగ్‌ పోస్టులు ఉండవని భావించిన కమిషన్‌.. గ్రూప్‌-2, గ్రూప్‌-3 ప్రక్రియను పక్కనబెట్టింది. కోర్టు తీర్పుతో గ్రూప్‌-1ను విజయవంతంగా పూర్తి చేసిన కమిషన్‌, 2022 నోటిఫికేషన్‌లో ఇచ్చిన గ్రూప్‌-2లోని 783 పోస్టులు, 2023లో ఇచ్చిన గ్రూప్‌-3 నోటిఫికేషన్‌లోని 1365 పోస్టుల భర్తీపై దృష్టిపెట్టింది. ఈ పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫలితాలు ప్రకటించారు. ప్రక్రియ ప్రస్తుతం రఽధువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన అన్ని పరీక్షలు నోటిఫికేషన్‌ తర్వాత పూర్తిచేసేందుకు ఏపీసీఎస్సీకి కనీసం మూడేళ్ల సమయం పట్టింది. 1984లో నోటిఫికేషన్‌ జారీచేయగా.. పరీక్షలన్నీ పూర్తిచేసి నియామకపత్రాలు అందుకునేందుకు మూడేళ్లు పట్టింది. 1987లో విధుల్లో చేరారు. ఆ తర్వాత 1989లో ఇచ్చిన నోటిఫికేషన్‌తో పరీక్ష రాసిన అభ్యర్థులు 1994లో కొలువుల్లో చేరారు. మళ్లీ 15 ఏళ్ల తర్వాత 2004లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అప్పుడు ప్రక్రియ కాస్త వేగంగా జరిగింది. మూడేళ్లలో అంటే 2007లో నియామక పత్రాలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2011లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ సుదీర్ఘంగా సాగి 2018లో పూర్తయింది. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్‌-1 చరిత్రలో ఎక్కువ సమయం తీసుకుంది అప్పుడే. అప్పుడు ఏడేళ్ల సమయం పట్టింది. తెలంగాణ ఏర్పాడ్డక బీఆర్‌ఎస్‌ హయాంలో తొలిసారి 2022లో వెలువడిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ పేపర్‌ లీక్‌తో మధ్యలోనే రద్దయింది.


ఆ తర్వాత గత కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి నిర్వహించినా బయోమెట్రిక్‌ నిర్లక్ష్యం, సవరణలపై కేసులతో గత ప్రభుత్వ కాలం ముగిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీఎ్‌సపీఎస్సీని ప్రక్షాళన చేశారు. ఫిబ్రవరి-2024లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలచేసింది. మే, జూన్‌లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. సెప్టెంబరు, అక్టోబరులో మెయిన్స్‌ నిర్వహించారు. ఈ ఏడాది మార్చి-10న ఫలితాలు ప్రకటించారు. ఫలితాలపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయుంచడంతో ఏప్రిల్‌లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఐదు నెలలు ఆలస్యమైంది. బుధవారం మద్యాహ్నం కోర్టు తీర్పు వచ్చిన 12 గంటల్లోపే తుది జాబితాను టీజీఎ్‌సపీఎస్సీ ప్రకటించేసింది. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ప్రకటించిన 7నెలల్లోపే ప్రాథమిక, ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన టీజీఎ్‌సపీఎస్సీ 11నెలల్లోనే ఫలితాలను ప్రకటించింది. మొత్తంగా 19 నెలల్లో తుది జాబితా విడుదలచేసి ప్రక్రియను ముగించింది. గత నాలుగు దశాబ్దాల్లో నిర్వహించిన పరీక్షలో అత్యంత వేగంగా పూర్తయిన పరీక్ష ఇదే కావడం గమనార్హం.


రేపు గ్రూప్‌-1 అభ్యర్థులకు నియామక పత్రాలు

గ్రూప్‌-1 అభ్యర్థులకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందజేస్తారని సీఎస్‌ రామకృష్ణారావు తెలిపారు. ఆ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి మంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అభ్యర్థితో పాటు వారి కుటుంబం నుంచి ఇద్దరిని కార్యక్రమానికి అనుమతించాలని సూచించారు. కాగా, అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన శుక్రవారం జరగనుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత శాఖకు వెళ్లి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని టీజీపీఎస్సీ కోరింది.

Updated Date - Sep 26 , 2025 | 06:52 AM