DNA Fingerprinting: హైదరాబాద్‌లో ట్రూత్ ల్యాబ్స్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ యూనిట్
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:45 AM
ఫర్టిలిటీ కేంద్రాల్లో మోసాల నేపథ్యంలో ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ హైదరాబాద్‌లో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ యూనిట్..
బంజారాహిల్స్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఫర్టిలిటీ కేంద్రాల్లో మోసాల నేపథ్యంలో ట్రూత్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సంస్థ హైదరాబాద్‌లో డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ యూనిట్ (డీఎన్‌ఏ పరీక్షల కేంద్రం)ను ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన నాన్ ప్రాఫిట్ ఫోరెన్సిక్ సంస్థ జీనోమ్ ఫౌండేషన్‌తో కలి సి దీన్ని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ట్రూత్ ల్యాబ్స్ చైర్మన్ గాంధీ పీసీ ఖాజా మంగళవారం మీడియాతో మాట్లాడారు. డీఎన్‌ఏ పరీక్షలకు ట్రూత్‌ల్యాబ్స్ భారత్‌లోనే మొట్టమొదటి ఐఎ్‌సవో సర్టిఫైడ్ సంస్థ అన్నారు. సరగసీ పేరుతో నవజాత శిశువుల అక్రమ రవాణా సమస్య పరిష్కారానికి డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ దోహదపడుతుందని చెప్పారు. ఐవీఎఫ్, సరగసీ తదితర విధానాల్లో తల్లిదండ్రులైన వారి పిల్లల జన్యువులను గుర్తించి, నిర్ధారించేందుకు ఇది అవసరమన్నారు. సమావేశంలో జీనోమ్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కనక భూషణం తదితరులు పాల్గొన్నారు.