Share News

CM Revanth Reddy: ట్రంప్‌ నిర్ణయంతో షాక్‌

ABN , Publish Date - Sep 21 , 2025 | 07:21 AM

హెచ్‌-1బీ వీసాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులు అన్ని వర్గాలను దిగ్ర్భాంతికి గురి చేశాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

CM Revanth Reddy: ట్రంప్‌ నిర్ణయంతో షాక్‌

  • తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతం

  • కేంద్రం అమెరికాతో చర్చలు జరపాలి

  • హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపుపై సీఎం

  • వీసా ఫీజు పెంపుతో రాష్ట్రంపై ప్రభావం

  • కేంద్రానికి లేఖ రాస్తాం : మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): హెచ్‌-1బీ వీసాల అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులు అన్ని వర్గాలను దిగ్ర్భాంతికి గురి చేశాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. భారత్‌- అమెరికా మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంఽధాల నేపథ్యంలో ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అమెరికాకు ఎంతో కాలంగా సేవలందిస్తున్న ఐటీ ఉద్యోగులు, నిపుణుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని కోరారు. తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతమన్న సీఎం రేవంత్‌.. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ యుద్ధ ప్రాతిపదికన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్‌-1బీ వీసాల అంశంపై స్పందించిన సీఎం రేవంత్‌ ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఇక, హెచ్‌-1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయంతో తెలంగాణపై తీవ్ర ప్రభావం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఏటా విదేశాల నుంచి భారత్‌కు వచ్చే మొత్తం నిధులు(రెమిటెన్స్‌)ల్లో 8.1 శాతం వాటా కలిగిన తెలంగాణ.. రెమిటెన్స్‌ల్లో దేశంలో నాలుగో స్థానంలో ఉందని తెలిపారు. ట్రంప్‌ నిర్ణయం వల్ల దేశంలో అత్యధికంగా నష్టపోయే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటనే విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ట్రంప్‌ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతున్నా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సచివాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడి ఆలోచన తీరు ఆయన ప్రియ మిత్రుడు మోదీకే బాగా తెలుసంటూ శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు. 2024-25లో భారత్‌కు రికార్డు స్థాయిలో 135.46 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌ రాగా, ఇందులో అమెరికా వాటా 27.7 శాతమని తెలిపారు. ట్రంప్‌ తాజా నిర్ణయం వల్ల ఆ రెమిటెన్సులు తగ్గి మన విదేశీ మారక ద్రవ్య నిల్వపై ప్రభావం పడుతుందని చెప్పారు. ఈ విషయాలు తెలిసినా ముందస్తుగా అమెరికాతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం చొరవ చూపలేదని ఆరోపించారు. ఇప్పటికైౖనా ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి మేల్కోని అమెరికాతో చర్చలు జరపాలని శ్రీధర్‌బాబు కోరారు.

Updated Date - Sep 21 , 2025 | 07:22 AM