TRS Dominates Telangana By Elections: 9 ఉప ఎన్నికల్లో.. 7 సార్లు అధికార పార్టీ విజయం
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:12 AM
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా రాష్ట్రంలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. 7 సార్లు అధికార పార్టీయే విజయం సాధించింది....
రెండింట విపక్షాల గెలుపు.. ఆ రెండూ బీజేపీవే
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా రాష్ట్రంలో 9 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగ్గా.. 7 సార్లు అధికార పార్టీయే విజయం సాధించింది. రెండు చోట్ల బీజేపీ గెలిచింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) 63 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ 21, తెలుగుదేశం 15, మజ్లిస్ 7, బీజేపీ 5.. వైసీపీ, బీఎ్‌సపీ, ఫార్వర్డ్‌బ్లాక్‌లు కలిపి 8 స్థానాల్లో గెలిచాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి చనిపోవడంతో 2016 ఫిబ్రవరి 13న ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అకాల మరణంతో 2016 మేలో ఉప ఎన్నిక జరగ్గా.. టీఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయింది. 2019 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ నుంచి శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. 2020లో దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక ఉప ఎన్నిక వచ్చింది. 2020 నవంబరులో జరిగిన ఎన్నికలో అక్కడ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా గెలిచిన నోముల నర్సింహయ్య చనిపోవడంతో 2021 ఏప్రిల్‌లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో నర్సింహయ్య తనయుడు భగత్ గెలుపొందారు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌ను టీఆర్‌ఎస్ పొమ్మనలేక పొగబెట్టి బయటికి పంపడంతో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన 2021లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. 2018లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేయడంతో 2022లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందారు. 2023 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2024 ఫిబ్రవరి 23న కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందారు. 2023 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయం సాధించగా.. ఆయన అనారోగ్యంతో చనిపోయారు.