Dont Touch Our Lands: మా భూముల జోలికి రావొద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:58 AM
రీజినల్ రింగ్ రోడ్డుకు ఆర్‌ఆర్‌ఆర్ భూములు ఇచ్చేది లేదని, తమ భూముల జోలికి రావొద్దని, ఆర్‌ఆర్‌ఆర్..
తప్పనిసరైతే మార్కెట్ ధర చెల్లించాల్సిందే
హెచ్‌ఎండీఏ ఎదుట ట్రిపుల్‌ఆర్ బాధిత రైతుల ఆందోళన.. హైవేపై రాస్తారోకో
హైదరాబాద్ సిటీ, యూస్‌ఫగూడ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డుకు(ఆర్‌ఆర్‌ఆర్) భూములు ఇచ్చేది లేదని, తమ భూముల జోలికి రావొద్దని, ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చాలని అక్కడి రైతులు ఆందోళనకు దిగారు. ఒకవేళ భూములు సేకరించాలనుకుంటే బహిరంగ మార్కెట్ ధర ప్రకారం పరిహరం చెల్లించి భూములు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగు జిల్లాలోని 20 మండలాలకు చెందిన రైతులు, భూ యజమానులు సోమవారం పెద్దఎత్తున హైదరాబాద్ అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయానికి తరలివచ్చారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో హెచ్‌ఎండీఏ ఎదుట పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులను కలిసేందుకు బాధితులు ప్రయత్నించగా సాధ్యపడలేదు. అభ్యంతరాలను పేపర్ మీద రాసిచ్చి, వెళ్లిపోవాలంటూ అక్కడి సిబ్బంది చెప్పడంతో రైతులు కార్యాలయం ఎదుట రహదారిపైకి చేరుకొని ప్లకార్డులు పట్టుకొని రాస్తారోకో చేశారు. రైతులు రోడ్డు మీద కూర్చోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు రైతులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి హెచ్‌ఎండీయే కార్యాలయంలోకి తరలించారు. ఫలితంగా రైతులు కార్యాలయంలోనే బైఠాయించారు. ఈ ఆందోళనలో యాదాద్రి, నల్లగొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. హెచ్‌ఎండీఏ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, సీపీవో రవీందర్‌రెడ్డిని కలిసి రైతులు తమ అభ్యంతరాలను వివరించారు.