Tributes Paid to Former Minister Damanna: మాజీ మంత్రి దామన్నకు అశ్రునివాళి
ABN , Publish Date - Oct 04 , 2025 | 03:23 AM
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు, అభిమానులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు...
కన్నీరు పెట్టిన పాత తరం నేతలు
సూర్యాపేటలో వాహనాలతో భారీ ర్యాలీ
సూర్యాపేట, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రజలు, అభిమానులు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ నెల 1వ తేదీన ఆయన కన్నుమూయగా జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో సూర్యాపేటకు తరలించారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు మార్గమధ్యంలో నాయకులు, కార్యకర్తలు రహదారులపైకి వచ్చారు. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, అయిటిపాముల, నకిరేకల్, కేతేపల్లి, సూర్యాపేట మండలాల్లో సెవెన్‌స్టార్ కూడలి, పిల్లలమర్రి క్రాస్‌రోడ్డు, తాళ్ళగడ్డ వద్ద అభిమానులు కడసారి నివాళులర్పించారు. పాత తరం కాంగ్రెస్ నాయకులు దామోదర్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రి 9గంటలకు సూర్యాపేటకు చేరుకోగా దామోదర్‌రెడ్డి నివాసంలో భౌతికకాయానికి ప్రజలు నివాళులర్పించారు.