Removal of Lambadas from ST List: లంబాడాలను ఎస్టీల నుంచి తొలగించాల్సిందే
ABN , Publish Date - Nov 24 , 2025 | 04:09 AM
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్ చేశారు. సామాజికంగా, ఆర్థికంగా తమ కంటే ఎన్నో రెట్లు ముందున్న లంబాడాలు..
ఉట్నూర్ ధర్మ యుద్ధం మహాసభలో డిమాండ్
కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన ఆదివాసీలు
ఉట్నూర్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్ చేశారు. సామాజికంగా, ఆర్థికంగా తమ కంటే ఎన్నో రెట్లు ముందున్న లంబాడాలు.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గిరిజన కోటా అవకాశాలను వినియోగించుకుంటున్నారని తెలిపారు. చదువు, చైతన్యం లేక గూడేలకే పరిమితమై.. అనేక రంగాల్లో వెనుకబడిన ఆదివాసీలు.. లంబాడాలతో పోటీ పడలేకపోతున్నారని అన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో బీసీ కోటాలో ఉన్న లంబాడాలను.. తెలంగాణలో కూడా అదే జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఎంపీడీవో గ్రౌండ్‌లో ఆదివాసీ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ‘ఆదివాసీల ధర్మ యుద్ధం మహాసభ’ జరిగింది. లంబాడాలను ఎస్టీల నుంచి తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ తరహాలో రాజకీయ చైతన్యం పొంది, ఉద్యమాలు చేయాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని చెప్పారు. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగ రాజకీయ అవకాశాల్లో ఆదివాసీలు నష్టపోతున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలిపారు. ప్రభుత్వం దిగి రావాలంటే ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.