Tribal Gurukula Construction: అసంపూర్తిగా గిరిజన గురుకులాలు!
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:45 AM
అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన గురుకులాల భవనాల నిర్మాణం పూర్తి కావడం లేదు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి...
18 నెలల్లో చేయాల్సిన భవనాల నిర్మాణం.. అధికారుల నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి పెండింగ్
98 భవనాలకు పూర్తయింది 43
2016లో మంజూరైనా.. ఇంకా సాగదీత
ప్రభుత్వంపై ఏటా 7ు అదనపు భారం
అద్దె భవనాల్లో సౌకర్యాల్లేక ఇబ్బందులు
అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు.. నిబంధనలు గాలికి
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యంతో గిరిజన గురుకులాల భవనాల నిర్మాణం పూర్తి కావడం లేదు. 18 నెలల్లో పూర్తి కావాల్సిన పనులు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉన్నాయి. నిధులు ఉన్నా సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఏటా 7 శాతం ఎస్‌ఎ్‌సఆర్ ధర పెంపుతో ఖజానాపై అదనపు భారం పడుతోంది. అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కై నిబంధనలకు నీళ్లొదిలారన్న ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అద్దె భవనాల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 188 గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో 98 గురుకులాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం 2016-17, 2022-23లో రూ.463 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.4.20 కోట్ల చొప్పున కేటాయించగా జీ ప్లస్ 3 భవనంతో పాటు ఓహెచ్‌ఎ్‌సఆర్, ప్రహరిగోడ, కిచెన్, డైనింగ్ నిర్మించాలి. ఇప్పటి వరకు రూ.164 కోట్ల ఖర్చుతో 43 భవనాల నిర్మాణం పూర్తి చేసినట్లు ఆ శాఖ నివేదికల్లో పేర్కొన్నా.. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో వాటిలో చాలావరకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికీ మరో 51 భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 2022-23లో రూ.195 కోట్లతో 45 పనులు మంజూరు కాగా వీటిలో ఒక్కటీ పూర్తికాలేదు. 2016-17లో మంజూరైన వాటిలో సైతం చాలా వరకు అసంపూర్తిగానే ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో భవనం జీ ప్లస్ 2 వరకే పూర్తయింది. నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయకుండా అదనపు నిధుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. నల్గొండ జిల్లా దామరచర్లలో ఇటీవల పనులు మొదలుపెట్టి మొదటి అంతస్తు శ్లాబ్ వేశారు. అదనపు నిధులు మంజూరయ్యాకే పనులు కొనసాగిస్తామని కాంట్రాక్టర్ పనులు ఆపేస్తే.. అధికారులు మౌనంగా ఉండిపోయారు. రంగారెడ్డి జిల్లా కౌడిపల్లిలో స్థల సేకరణలో ఇబ్బందులను సాకుగా చూపుతూ పనులు మొదలుపెట్టలేదు. హైదరాబాద్, ఏటూరు నాగారం, భద్రాచలం, ఉట్నూరు, మెదక్ తదితర డివిజన్లలో కూడా భవనాలు పూర్తికాలేదు. ఈ పనులు మంజూరై 8 ఏళ్లు దాటిపోవడంతో ఏడాదికి 7 శాతం చొప్పున 56 శాతం ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడింది. అప్పటి ధరలకు అనుగుణంగా ఒక్కో భవనానికి రూ.4.20 కోట్ల చొప్పున నిర్ణయించగా అదనంగా రూ.2.50 కోట్లకుపైనే చెల్లించాల్సి వచ్చింది.
పునాదిలో రాయి కటింగ్‌కే రూ.కోటి!:
భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాల్సిన ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిబంధనలను విస్మరించారు. అందుకు మెదక్ జిల్లా నర్సాపూర్, హైదరాబాద్‌లోని ఆసి్‌ఫనగర్ భవన నిర్మాణాలే ఉదాహరణ. నర్సాపూర్‌లో పునాదుల్లో రాయి కటింగ్‌కు సుమారు రూ.1.20 కోట్లు ఖర్చు చేశారు. వాస్తవానికి ప్రభుత్వం రాయి కటింగ్‌కు క్యూబిక్ మీటరుకు రూ.900 చొప్పున ధర నిర్ణయించగా ఇంజనీరింగ్ అధికారులు ఏకంగా రూ.2,200పైనే పెంచేశారు. ఈ ధర చాలా ఎక్కువని న్యాక్ అభ్యంతరం తెలిపినా పట్టించుకోలేదు. న్యాక్ నివేదికలను మాయంచేసి ఎక్కువ ధరకు బిల్లులు చేసినట్లు సమాచారం. భవనానికి కేటాయించిన రూ.4.20 కోట్లలో ఎక్కువ మొత్తం పునాదుల దశలోనే ఖర్చవడంతో నిధులు సరిపోవట్లేదంటూ పనులు ఆపి.. అదనపు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం కొసమెరుపు. ఇక ఆసిఫ్ నగర్‌లో భవన నిర్మాణ పనులు మొదలుకాలేదు. ఇక్కడ అనుమతి లేకున్నా 110 మీటర్ల ప్రహరిగోడ నిర్మాణానికి రూ.1.10 కోట్లు ఖర్చు చేశారు. డీపీఆర్ లేకుండానే ప్రహరి నిర్మించేసి.. నిధులు సరిపోవట్లేదని భవన నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడానికి కూడా ఇవి నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి.