Share News

Tribal Attack on Forest Department: అటవీ శాఖ సిబ్బందిపై గిరిజనుల దాడి

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:08 AM

నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో అటవీశాఖ సిబ్బందిపై గిరిజనులు బుధవారం దాడి చేశారు. కంబాలపల్లి ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ తెలిపిన....

Tribal Attack on Forest Department: అటవీ శాఖ సిబ్బందిపై గిరిజనుల దాడి

  • ఏడుగురికి గాయాలు.. నల్లగొండ జిల్లాలో ఘటన

చందంపేట, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్టలో అటవీశాఖ సిబ్బందిపై గిరిజనులు బుధవారం దాడి చేశారు. కంబాలపల్లి ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ భాస్కర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గువ్వలగుట్టలోని అటవీ భూమిలో స్థానిక గిరిజనులు పంటలు సాగు చేసుకుంటున్నారనే సమాచారంతో అటవీ శాఖ సిబ్బంది అక్కడికి వెళ్లారు. సాగు చేసేందుకు ఆక్రమిస్తున్న భూమిని వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. అయితే తమకు ఆ భూములపై పోడు హక్కులు ఉన్నాయని, కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని అయిదుగురు గిరిజనులు వాదనకు దిగారు. దీంతో భూ యాజమాన్య హక్కు పత్రాలను చూపించాలని అటవీశాఖ సిబ్బంది కోరారు. ఈ క్రమంలో ఆ ఐదుగురు గిరిజనులను జీపులో తీసుకొని వెళ్తుండగా.. గిరిజనులు కొంతమంది గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు అటవీ శాఖ సిబ్బందికి గాయాలు కాగా దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో బీట్‌ ఆఫీసర్లు మహమ్మద్‌ ఖాజమెహిద్‌, కృష్ణ, విష్ణు, సుమన్‌, కిరణ్‌కుమార్‌, వాచర్లు శ్రీనివా్‌సకుమార్‌, చంద్రయ్య ఉన్నారు. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 13 , 2025 | 05:08 AM