Share News

National Highways: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఈజీ!

ABN , Publish Date - Oct 04 , 2025 | 03:21 AM

జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా మారనుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో జాతీయ రహదారులు...

National Highways: జాతీయ రహదారులపై ప్రయాణం మరింత ఈజీ!

  • క్యూఆర్‌ కోడ్‌ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్న ఎన్‌హెచ్‌ఏఐ

  • వాటి స్కాన్‌తో రహదారులు, ముఖ్యమైన సమాచారం పొందొచ్చు

న్యూఢిల్లీ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారులపై ప్రయాణం మరింత సులభతరంగా, సౌకర్యవంతంగా మారనుంది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో జాతీయ రహదారులు, వాటి వెంబడి ఉండే సదుపాయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లభించనుంది. ఈ మేరకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు సౌకర్యార్థం క్యూఆర్‌ కోడ్‌ను సిద్ధం చేసింది. రహదారి సూచికతోపాటు ఫీల్డ్‌ ఆఫీసు, ఆస్పత్రులు, పెట్రోల్‌ పంపులు, టాయిలెట్లు, పోలీస్‌ స్టేషన్లు, రెస్టారెంట్లు, టోల్‌ ప్లాజాలు, ట్రక్‌-లే-బైలు, పంక్చర్‌ రిపేర్‌ దుకాణాలు, వాహన సర్వీస్‌ స్టేషన్లు, ఈ-చార్జ్జింగ్‌ స్టేషన్ల సమాచారం దీంతో తెలుసుకోవచ్చు. అలాగే వీటికి ఎంతదూరంలో ఉన్నాం, ఏ సమయంలో అక్కడ సేవలు అందుబాటులో ఉంటాయి? వంటి సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈమేరకు క్యూఆర్‌ కోడ్‌లతో కూడిన సమాచార సైన్‌ బోర్డులను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ సైన్‌ బోర్డులు జాతీయ రహదారులకు ఇరువైపులా ఉండే విశ్రాంతి ప్రాంతాలు, టోల్‌ ప్లాజాలు, ట్రక్‌ లే బైలు, హైవే ప్రారంభ, ముగింపు పాయింట్లు, సంకేత పిల్లర్లు, బోర్డుల వద్ద అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొంది. జాతీయ రహదారి నంబర్‌, హైవే మార్పు, రహదారి పొడవు, నిర్మాణం, మెయింటనెన్స్‌ టైం, హైవే పెట్రోలింగ్‌ వంటి సమాచారం, సంబంధిత కాంటాక్డు నంబర్లు, టోల్‌, ప్రాజెక్టు మేనేజర్లు, రెసిడెంట్‌ ఇంజనీరు, ఎమర్జెన్సీ హైల్ప్‌లైన్‌ 1033 సమాచారాన్ని కూడా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పొందవచ్చని ఎన్‌హెచ్‌ఏఐ వివరించింది.

Updated Date - Oct 04 , 2025 | 03:21 AM