Transgender Rights: పేరు సరిపోలలేదని పరీక్ష నిరాకరణ
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:51 AM
ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షకు హాజరైన ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి అధికారులు షాకిచ్చారు. అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తిచేసి...
ట్రాన్స్‌జెండర్‌కు ఆర్‌ఆర్‌బీ అధికారుల షాక్
హసన్‌పర్తి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఆర్‌బీ నిర్వహించిన ఉద్యోగ పరీక్షకు హాజరైన ఓ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థికి అధికారులు షాకిచ్చారు. అన్ని అధికారిక ప్రక్రియలు పూర్తిచేసి, పరీక్ష హాల్‌కు చేరుకున్నప్పటికీ.. ధ్రువీకరణ పత్రాలలో పేరు సరిపోలడం లేదనే సాంకేతిక కారణాన్ని చూపుతూ ఆమెను పరీక్ష రాయడానికి తిరస్కరించారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా శుంభునిపేటకు చెందిన అజయ్ సింగ్ అలియాస్ అక్షయ .. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ట్రాన్స్‌జెండర్‌గా మారి పేరు మార్చుకుంది. అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలోనే పదో తరగతి మెమోలో ఉన్న భూక్య అజయ్‌సింగ్ పేరుతోనే ట్రాన్స్‌జెండర్‌గా ఉద్యోగ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. అదే పేరుతో ఆర్‌ఆర్‌బీ హాల్ టికెట్ జారీ చేసింది. అదే హాల్‌టికెట్‌తో పరీక్ష రాసేందుకు కేంద్రానికి చేరుకుంది. ఎస్‌ఎ్‌ససీ మెమోలో పేరు అజయ్‌సింగ్ అని ఉండగా.. ఆధార్, పాన్‌కార్డులో మాత్రం అక్షయగా ఉందంటూ పరీక్ష హాల్ నుంచి బయటకు పంపించారు. దీంతో అక్షయ బోరున విలపిస్తూ నిరాశతో ఇంటి దారి పట్టింది. ధ్రువీకరణ పత్రాల్లో పేర్లు సరిపోలక పరీక్షకు నిరాకరించడం పట్ల ట్రాన్స్‌జెండర్ యాక్టివిస్ట్ రేఖ ఆవేదన వ్యక్తం చేశారు.