రైళ్ల ఆలస్యం.. ప్రయాణికుల అవస్థలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:33 PM
జిల్లాలోని పలు రైల్వే స్టేషన్‌లకు రావాల్సిన పలు రైళ్లు శుక్రవారం గంటలకొద్ది ఆలస్యంగా నడిచాయి. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
బెల్లంపల్లి,జూన్27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు రైల్వే స్టేషన్‌లకు రావాల్సిన పలు రైళ్లు శుక్రవారం గంటలకొద్ది ఆలస్యంగా నడిచాయి. ముందస్తు సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రతి రైలు దాదాపు రెండునుంచి మూడు గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్‌వోబి వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్లరాకపోకలకు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. సిర్పూర్‌కాగజ్‌నగర్ టు సికింద్రాబాద్ మధ్య నిడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ పలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు సైతం గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ, వరంగల్‌తో పాటు బల్లార్షానాగ్‌పూర్, న్యూఢిల్లీకి వెళ్లే ఎంతో మంది ప్రయాణికులు జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల రైల్వే స్టేషన్‌లలో గంటలతరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు చేసేదేమిలేక ప్రైవేటు వాహనాలను, బస్సులను ఆశ్రయించి తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.