Road Accident: మృత్యు టిప్పర్.. మింగేసింది!
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:53 AM
రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ ఆ కుటుంబం పాలిట మృత్యు శకటంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా నలుగురి ప్రాణాలు బలిగొంది...
ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం
భిక్కనూరు, బోనకల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ ఆ కుటుంబం పాలిట మృత్యు శకటంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా నలుగురి ప్రాణాలు బలిగొంది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయరహదారిపై బుధవారం జరిగిన ఈ దుర్ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్‌కు చెందిన పాస్టర్ బాల్‌కిషన్ (53) భార్య కొన్నేళ్ల క్రితం మరణించింది. అప్పటినుంచి కామారెడ్డిలోని షాబ్దిపూర్ రోడ్డులో తన తల్లిదండ్రులతో అద్దెకు ఉంటున్నాడు. తన కూతురు జాస్విన్(29)ను ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ ప్రకాశ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించగా వీరికి ఇద్దరు బాలురు జోయల్ ప్రకాశ్ (4), జోయల్ జాట్సన్(4 నెలలు)ఉన్నారు. 20రోజుల క్రితం జాస్విన్ తన తండ్రి బాల్‌కిషన్ వద్దకు రాగా బుధవారం ఉదయం చిన్న బాబుకు భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో వ్యాక్సిన్ ఇప్పించేందుకు స్కూటీపై బయల్దేరారు. స్కూటీని బాల్‌కిషన్ నడుపుతుండగా వెనక జాస్విన్‌తో పాటు ఆమె ఇద్దరు కుమారులు ఉన్నారు. వాహనం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చేరుకోగానే 44వ జాతీయరహదారిపై రాంగ్‌రూట్‌లో ఎదురుగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో బాల్‌కిషన్, జాస్విన్, జోయల్ ప్రకాశ్‌కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందగా జాట్సన్ కామారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం కారణంగా దాదాపుగా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.