Election Tragedies: పంచాయతీ పోరులో విషాదాలు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:54 AM
పంచాయతీ ఎన్నికలు కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చాయి. ఓ అభ్యర్థి పోలింగ్ రోజున హఠాత్తుగా మరణించగా, మరో చోట ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురికి....
పోలింగ్ రోజునే మరణించిన ఓ అభ్యర్థి
కుమార్తెకు ఓటేసిన కాసేపటికే కన్నుమూసిన తండ్రి
నేలకొండపల్లి, చేవెళ్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికలు కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చాయి. ఓ అభ్యర్థి పోలింగ్ రోజున హఠాత్తుగా మరణించగా, మరో చోట ఎన్నికల బరిలో నిలిచిన తన కూతురికి ఓటేసిన కాసేపటికే తండ్రి చనిపోయాడు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన దామాల నాగరాజు (40) సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో నాగరాజు కొద్దిరోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో నాగరాజు ఆదివారం ఉదయం బ్రెయిన్ డెడ్‌కు గురై మరణించారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో నాగరాజుకు 16 ఓట్లు వచ్చాయి. ఇక, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం వెంకన్నగూడ గ్రామానికి చెందిన పోలిసేట బుచ్చయ్య(70) కుమార్తె రాములమ్మ ఆలూరు పంచాయతీ 14వ వార్డు సభ్యురాలిగా పోటీ చేశారు. ఆదివారం జరిగిన పోలింగ్‌లో భాగంగా ఓటేసిన బుచ్చయ్య పోలింగ్ కేంద్రంలో నుంచి బయటికి వస్తుండగా మూర్ఛ వచ్చి ఆ ఆవరణలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన పోలింగ్ అధికారులు బుచ్చయ్యను ఆస్పత్రికి తరలిం చేటప్పటికే మరణించారు.
ఓటేసేందుకు వస్తూ మృత్యుఒడిలోకి
ఎన్నికల్లో ఓటేసేందుకు స్వగ్రామాలకు వస్తూ రోడ్డు ప్రమాదాలకు గురై వేర్వేరు ఘటనల్లో ఇరువురు మరణించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలానా ఖేడ్‌కు చెందిన పల్లె సిద్దిరాములు, సుజాత దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఎన్నికల్లో ఓటేసేందుకు శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై మౌలానాఖేడ్‌కు బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలోని బాచేపల్లి సమీపంలోని హైవేపై వీరి ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో కింద పడ్డ దంపతులు గాయపడ్డారు. దంపతులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా రాములు మార్గమధ్యలోనే మరణించాడు. సుజాత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అలాగే, కొత్తగూడెం జిల్లాలోని వేదాంతపురానికి చెందిన నడిది వెంకన్న(27) ఓటేసేందుకు దమ్మపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా అశ్వారావుపేట బస్టాండ్ బయ ఓ వాహనం ఢీకొని మరణించాడు.