Share News

kumaram bheem asifabad- అచ్చెల్లిలో విషాదం

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:51 PM

సిర్పూర్‌(టి) మండలం అచ్చెల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పశువులను మేతకు తరలించిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేయడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలుగా మారారు.

kumaram bheem asifabad- అచ్చెల్లిలో విషాదం
తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలు

- అనాఽథలుగా మారిన నలుగురు పిల్లలు

- ఆదుకుంటామని అధికారులు, నాయకుల హామీ

సిర్పూర్‌(టి), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలం అచ్చెల్లి గ్రామంలో విషాదం నెలకొంది. పశువులను మేతకు తరలించిన దంపతులపై ఎలుగుబంటి దాడి చేయడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీంతో వారి నలుగురు పిల్లలు అనాథలుగా మారారు. అటవీ శాఖ, పోలీసు అధికారుల కథనం ప్రకారం.. అచ్చెల్లి గ్రామానికి చెందిన దూలం శేఖర్‌(45), దూలం సుశీల(38) భార్యాభర్తలు, వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వీరు గ్రామంలో పశువులు కాస్తూ కుటుంబాన్ని పోషంచుకుంటున్నారు. గురువారం పెద్దబండ అటవీ ప్రాంతానికి పశువులను మేతకు తరలించారు. వెళ్లారు. సాయంత్రం శేఖర్‌, సుశీల ఇంటికి చేరలేదు. కానీ పశువుల మాత్రం ఇంటికి చేరుకున్నాయి. దీంతో ఆందోళనకు గురైన పిల్లలు ఈ విషయాన్ని బంధువులకు చెప్పారు. చీకట్లో అడవిలో గాలించినా ఆచూకీ లభించలేదు. శేఖర్‌ వద్ద ఉన్న సెల్‌కు ఫోన్‌ చేసినప్పటికీ రింగ్‌ వస్తున్నా ఎత్తడం లేదు. మరింత భయాందోళనకు గురైన పిల్లలు తక్షణమే ఎస్సై సురేష్‌కు సమాచారం అందించి తండ్రి ఫోన్‌ నంబర్‌ను ఇచ్చారు. దీంతో కౌటాల సీఐ సంతోష్‌, ఎస్సై సురేష్‌ అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టి రాత్రి 12 గంటల ప్రాంతంలో సెల్‌పోన్‌ సిగ్నల్స్‌ ఉన్న స్థలానికి చేరుకుని అక్కడ పడి ఉన్న మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎలుగుబండి దాడి చేసిన ఆనవాళ్లు కనిపించడంతో మృతదేహాలను రాత్రి సిర్పూర్‌(టి) ఆసుపత్రి మార్చురీకి తరలించారు. శుక్రవారం ఉదయం కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహిదోద్దీన్‌, డీఎఫ్‌వో సుశాంత్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనతో అచ్చెల్లి గ్రామంలో విషాదచాయలు అలుము కున్నాయి. నలుగురు పిల్లలు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలయ్యారని బంధువులు, గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..

ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన దూలం శేఖర్‌, సుశీల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగంతో పాటు వైల్డ్‌ లైఫ్‌ ద్వారా ఇద్దరి పేరిట రూ.20 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని డీఎఫ్‌వో సుశాంత్‌ అన్నారు. ఎలుగుబంటి దాడి చేయడంతోనే శేఖర్‌, సుశీలలు మృతి చెందారని అన్నారు. మృతుల అంత్యక్రియల కోసం అటవీ శాఖ నుంచి రూ.20 వేల తక్షణ సాయం అందజేశారు. అటవీ శాఖ తరపు అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.ఆయన వెంట ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్వో ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌ఎస్‌వో, ఎఫ్‌బీవోలు ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం..

సిర్పూర్‌(టి) మండలం అచ్చెల్లి అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో భార్యభర్తలైన దూలం శేఖర్‌, దూలం సుశీల కుటుంబీకులను ఆదుకుంటామని ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. శుక్రవారం సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మృతదేహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథ పిల్లలకు ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇల్లు, ఐదు ఎకరాల భూమితో పాటు పిల్లల విద్యావైద్య పరంగా ఆదుకుంటామని చెప్పారు. ఇన్‌చార్జి మంత్రి కృష్ణారావు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖలకు ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఫోన్‌లో విషయం తెలిపారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ దండె విఠల్‌ తెలిపారు. మృతుల అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

Updated Date - Sep 26 , 2025 | 10:51 PM