Global summit hospitality: అతిథులకు తెలంగాణ చిరుతిళ్లు
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:18 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వస్తున్న అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారికి స్వాగతం పలికేందుకు......
హైదరాబాద్, డిసెంబరు 7 (ఆదివారం): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వస్తున్న అతిథుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారికి స్వాగతం పలికేందుకు 100 మంది డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో ఒక బృందాన్ని నియమించింది. ఆదివారం వచ్చిన అతిథులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పర్యాటక శాఖ ఆధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఉదయం నేపాల్, బ్యాంకాక్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయంలో నుదుటన బొట్టు పెట్టి పూలమాల వేసి ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మేళతాళాలు, కూచిపూడి, కథక్ నృత్య కళాకారుల ప్రదర్శన, మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ ప్రత్యేక వాహనాల వద్దకు తోడ్కొని వచ్చారు. అక్కడి నుంచి బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తీసుకెళ్లారు. కాగా, అతిథులకు తెలంగాణ చిరుతిళ్లతో కూడిన ప్రత్యేక డైట్ కిట్‌ను అందజేస్తున్నారు. ఇందులో సకినాలు, చెక్కగారెలు, నువ్వుల లడ్డూ, ఇప్పపువ్వు లడ్డూ, మక్క పేలాలు, బాదమ్‌కీ జాలి ఉన్నాయి. ఆదివారం వచ్చిన వారికి ఈ డైట్ కిట్‌ను అందజేశారు. సమ్మిట్ జరిగే సమయంలో హైదరాబాద్ ధమ్ బిర్యానీ, పాయా, మటన్ కర్రీతో పాటు వెజ్, నాన్‌వెజ్‌కు సంబంధించిన పలు వంటలను అందుబాటులో ఉంచనున్నారు. విదేశీ ప్రతినిధుల కోసం ఆయా దేశాలకు చెందిన వంటలనూ సిద్ధం చేయిస్తున్నారు.
సెల్‌ఫోన్ సిగ్నళ్లు.. వైఫై సౌకర్యం..
గ్లోబల్ సమ్మిట్‌లో సెల్‌ఫోన్ సిగ్నళ్లకు, అక్కడ ఏర్పాటు చేసిన హాళ్లలో వైఫైకి సమస్యలు రాకుండా ఉండేందుకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బీఎ్‌సఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ సహా పలు ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు జరిపి 2జీ సిగ్నళ్లు కూడా అందుబాటులో లేని ఫ్యూచర్ సిటీలో 5జీ సిగ్నళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకేసారి 25వేల మంది వైఫై సేవలు వినియోగించుకునేందుకు వీలుగా సిగ్నల్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. సైబర్ సెక్యూరిటీ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పరిష్కరించేలా టీ-ఫైబర్ ఆధ్వర్యంలో 45మందితో టీమ్‌ను, పర్యవేక్షణకు కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సదస్సు ప్రాంగణంలో 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను అందించనున్నారు.