ట్రాక్టర్ ట్రాలీ మృత్యు శకటమై..
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:40 AM
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు.

రోడ్డుపై ఉన్న ట్రాలీని ఢీకొన్న బైక్.. ఒకరు మృతి
రెండు గంటల వ్యవధిలో అదే ట్రాలీని ఢీకొన్న మరో బైక్.. మరో యువకుడు మృత్యువాత
కనగల్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని బాబాసాయిగూడెం స్టేజీ సమీ పంలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు సింగం కొండల్ బుధవారం సాయంత్రం తన ట్రాక్టర్ ట్రాలీలో ధాన్యం నింపుకుని నల్లగొండలోని ఓ మిల్లులో విక్రయించేందుకు గ్రామం నుంచి బయల్దేరాడు. బాబాసాయిగూడెం స్టేజీ వద్దకు చేరుకోగానే ట్రాక్టర్ ట్రాలీ టైర్ పంక్చర్ అయింది. దీంతో ట్రాలీని రోడ్డు పక్క ఉంచి ట్రాక్టర్ ఇంజన్‌ను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రాత్రి 8:30 గంటల సమయంలో హాలియా మండలం శ్రీనాధపురం గ్రామానికి చెందిన చింతకాయల కిరణ్‌కుమార్(32) కనగల్ మండలంలోని తుర్కపల్లి గ్రామంలో నడుస్తున్న వరికోత మిషన్‌వద్దకు బైక్ తీసుకుని అదేగ్రామానికి చెందిన జినుకుల అఖిల్‌తో కలిసి వస్తున్నాడు. మార్గమధ్యలో బాబాసాయిగూడెం స్టేజీ వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన ట్రాలీని వెనుకనుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కిరణ్‌కుమార్, అఖిల్‌కు తీవ్రంగా గాయపడ్డారు. అటుగా వెళ్తున్న కొందరు వాహనదారులు గమనించి క్షతగాత్రులను 108వాహనంలో చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకొనేలోపే కిరణ్‌కుమార్ మృతిచెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. తీవ్రంగా గాయపడిన అఖిల్‌కు చికిత్సను అందిస్తున్నారు.
అదే ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని..
మరో రెండు గంటల తర్వాత రాత్రి 11 గంటల సమయంలో గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామానికి చెందిన బల్గూరి శేఖర్‌గౌడ్(35) మిర్యాలగూడలో ఓ దుస్తులు దుకాణం నిర్వహిస్తున్నాడు. షాపు మూసి వేసిన అనంతం బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా కనగల్ మండలం బాబాసాయిగూడెం స్టేజీ వద్దకు చేరుకోగానే రోడ్డుపై ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొన్నాడు. శేఖర్‌గౌడ్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. రెండు గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగాయని మృతుల బంధువులు ఆరోపించారు. మృతదేహాలకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కిరణ్‌కుమార్ సోదరుడు సంతోష్, శేఖర్‌గౌడ్ భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు ఢీకొని..
చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. నార్కట్‌పల్లి గ్రామానికి చెందిన భాశెట్టి శ్రీనివా్‌స(57)చిట్యాలలోని ఓ రైస్‌మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం బైక్‌పై మిల్లుకు వెళ్తుండగా భువనగిరి నుంచి చిట్యాల వైపు ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లావాసి మృతి
దమ్మపేట: సూర్యాపేట జిల్లా కాసరబండ గ్రామానికి చెందిన మచ్చ ఎల్లయ్య(37) కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సూర్యాపేటకు చెందిన కొందరితో కలిసి కూలి పనుల నిమిత్తం దమ్మపేట మండలం గట్టుగూడెంలో వేరు శనగ కోత పనుల కోసం వచ్చాడు. పనినిమిత్తం తోటలోకి వెళుతూ రోడ్డు దాటుతుండగా అశ్వారావుపేట వైపునకు వెళ్తున్న లారీ వేగంగా వెళుతూ అదుపు తప్పి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా పరిశీలించిన డాక్టర్లు ఎల్లయ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు.