రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
ABN , Publish Date - May 05 , 2025 | 12:33 AM
తిప్పర్తి మండ లం రామలింగాలగూడెం దేవుని గుట్టపై రాతి యుగపు చిత్రకళ ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ ఇండియా ఫౌండేషన సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
రామలింగాలగూడెంలో ఆదిమానవుని ఆనవాళ్లు
6 వేల సంవత్సరాల నాటి రాతికళ
వెలుగు చూసిన కొత్త రాతియుగపు రాతికళ
కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి
నల్లగొండ, మే 4 (ఆంధ్రజ్యోతి): తిప్పర్తి మండ లం రామలింగాలగూడెం దేవుని గుట్టపై రాతి యుగపు చిత్రకళ ఆనవాళ్లు ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ ఇండియా ఫౌండేషన సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టను ఆదివారం ఆయన పరిశీలించి అక్కడి విశేషాలను విలేకరులకు తెలిపారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, వారు నిత్యం వాడుకునే రాతి పరికరాలతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా నాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ రాతికళ క్రీస్తుపూర్వం 6000-4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని తెలిపారు. గుట్టపై సహజంగా ఏర్పడిన నీటి దోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయన్నారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్దపెద్ద బండల మాటున గల గుహల్లోనూ, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నివసిస్తూ, తీరిక సమయాల్లో తాము పాల్గొన్న సంఘటనలను, చూసిన దృశ్యాలను వారు చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ పురాతన రాతికళను కాపాడి, భవిష్యత్తు తరాలకు తెలియచేయాలని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పి వెంకటేష్, మోతీలాల్ పాల్గొన్నారు.