TPCC Working President Jagga Reddy: దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 04:21 AM
దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు...
ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే.. నేడు మోదీని ప్రపంచ దేశాలు శాసిస్తున్నాయి
మోదీ నీడలోనే కేసీఆర్, జగన్, చంద్రబాబు
300 ఎంపీస్థానాల్లో కాంగ్రె్‌సను గెలిపించాలి
రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలి
ఇచ్చిన మాటమీద నిలబడే వ్యక్తి రాహుల్
ఆయన ప్రధాని అయితే తెలంగాణ అభివృద్ధి
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి అవుతుంది
తెలంగాణ, ఏపీ ప్రజలు ఆలోచన చేయాలి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సంగారెడ్డి టౌన్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే రాహుల్‌గాంధీ ప్రధాన మంత్రి కావాల్సిన అవసరం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆనాడు ఇందిరాగాంధీ ప్రపంచ దేశాలను శాసిస్తే.. నేడు ప్రపంచ దేశాలు ప్రధాని మోదీని శాసిస్తున్నాయన్నారు. తెలంగాణలో పదేళ్లు కేసీఆర్, ఏపీలో పదేళ్లు జగన్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉండి కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇచ్చినా కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. రెండు రాష్ట్రాల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం తీసుకువచ్చి దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన పేదలకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. ఈ పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో మహిళల ఉపాధి, యువతకు ఉద్యోగాలు, పేదలకు న్యాయం జరిగిందని చెప్పగలరా అని ప్రశ్నించారు. భారతదేశం సాఫ్ట్‌వేర్, ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించిందంటే అందుకు రాజీవ్ గాంధీనే కారణమన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలన్నారు. విదేశాల్లోని నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి బ్యాంక్ అకౌంట్లలో రూ. 15 లక్షలు వేస్తానని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోదీని దేశ ప్రజలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మోదీ నీడలోనే చంద్రబాబు, కేసీఆర్, జగన్‌ల పాలన సాగిందన్నారు. 300 కాంగ్రెస్ ఎంపీ స్థానాలను గెలిపించి దేశ ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని జగ్గారెడ్డి కోరారు. మాట ఇస్తే మాట మీద నిలబడే చరిత్ర రాహుల్.. ఆయన కుటుంబానికి మాత్రమే ఉన్నదన్నారు. రాహుల్ ప్రధానమంత్రి అయితే తెలంగాణ అభివృద్ధి కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం, పోలవరం పూర్తవుతుందన్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలు ఇప్పటి నుంచే ఆలోచన చేయాలని జగ్గారెడ్డి కోరారు.