Mahesh Goud: కామారెడ్డి సభ, పార్టీ కమిటీలే అజెండా!
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:02 AM
ఈ నెల 15న కామారెడ్డిలో తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను విజయవంతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటే ప్రధాన అజెండాగా సోమవారం ...
నేడు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత సమావేశం
పాల్గొననున్న మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్..
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15న కామారెడ్డిలో తలపెట్టిన బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను విజయవంతం చేయడం, పార్టీ కమిటీల ఏర్పాటే ప్రధాన అజెండాగా సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జులు, అనుబంధ సంఘాల చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, జై బాపూ, జై సంవిధాన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొంటున్నారు. బీసీ డిక్లరేషన్‌లోని అంశాలను ప్రభుత్వం అమలు చేస్తుండడం, టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ గౌడ్ ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో 15న కామారెడ్డిలో టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలనూ ఆహ్వానించాలని టీపీసీసీ యోచిస్తోంది. దీనికి సంబంధించి సమావేశంలో తీర్మానించే అవకాశముంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పురోగతిని సమీక్షించనున్నారు. పెండింగ్‌లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీపైనా చర్చించే అవకాశముంది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42ు రిజర్వేషన్ కల్పించే అంశం, స్థానిక ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై కూడా చర్చలు జరుపుతారు.