Jagga Reddy: రాహుల్ తెలంగాణ ఇస్తేనే.. నీకు పొలిటికల్ పర్సనాలిటీ వచ్చింది కేటీఆర్!
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:00 AM
రాహుల్‌గాంధీ తెలంగాణ ఇస్తేనే.. కేటీఆర్ కంటూ ఒక పొలిటికల్ పర్సనాలిటీ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు...
విభజన వల్ల కాంగ్రె్‌సకు నష్టం జరుగుతుందని నేను రాహుల్‌కు చెప్పా
అయినా తెలంగాణ ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు.. నేను, కుసుమ్‌కుమారే సాక్ష్యం
ఇచ్చిన మాటలను నెరవేర్చాలన్నారు
కేటీఆర్.. రాహుల్‌ను విజన్ లేదని విమర్శిస్తవా?
కేసీఆర్ వల్లనే నేను చట్టసభలకు వచ్చాను
నాకు రాజకీయ విలువలున్నాయి కాబట్టే.. ఈ విషయం చెప్పగలుగుతున్నా
నువ్వు రాహుల్‌పై మాట్లాడటం ఆపకుంటే.. నేను కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తది
కేటీఆర్‌కు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాహుల్‌గాంధీ తెలంగాణ ఇస్తేనే.. కేటీఆర్ కంటూ ఒక పొలిటికల్ పర్సనాలిటీ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌ను విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్‌ది కాదన్నారు. కేటీఆర్‌కు ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నా.. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చిన రాహుల్‌గాంధీకి విజన్ లేదంటూ విమర్శిస్తూ తప్పుగా మాట్లాడొద్దని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపైన ఆయన మాట్లాడటం ఆపకుంటే.. తాను కేసీఆర్ గురించి అనేక విషయాలు బయట చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ తన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు.
రాహుల్ ఎంత గొప్పవాడంటే..!
తెలంగాణ ఏర్పాటుకు ముందు తాను రాహుల్‌ను కలిశానని, రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోతుందని చెప్పానని జగ్గారెడ్డి వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ అవుట్ అయిపోతుంనీ చెప్పానన్నారు. తెలంగాణ ఇస్తే ఇక్కడ పూలు కురిపిస్తారే కానీ.. కాంగ్రెస్‌కు అధికారంమాత్రం ఇవ్వరనీ చెప్పానని వివరించారు. దానికి రాహుల్ స్పందిస్తూ.. తాము రాజకీయంగా ఆలోచన చేయట్లేదని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి చిరకాల వాంఛ నెరవేర్చాలన్న నిర్ణయానికి తాను, అమ్మ సోనియాగాంధీ వచ్చినట్లు తెలిపారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీలోని గొప్పతనం, కమిట్‌మెంట్ ఇదన్నారు. రాహుల్ చెప్పిన ఈ మాటలకు తాను, జెట్టి కుసుమ్‌కుమార్‌లే సాక్ష్యమని తెలిపారు. బీజేపీలో తనను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్న సమయంలో కేసీఆర్ తనను పిలిచారని, ఆయన ఇచ్చిన బీ ఫారమ్‌తోనే తాను సంగారెడ్డికి తొలిసారి ఎమ్మెల్యేను అయ్యానన్నారు. తనకు విలువలు ఉన్నాయి కాబట్టే గాంధీభవన్ వేదికగా ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు. కేటీఆర్‌కు కూడా రాజకీయ విలువలు ఉంటే.. పద్ధతిగా ఉండాలని, రాహుల్‌గాంధీ గురించి ఆచి తూచి మాట్లాడాలని హితవు పలికారు. రాహుల్‌గాంధీ తెలంగాణ ఇచ్చుండకపోతే ఇవాళ కేసీఆర్ ఇంట్లో అధికారం, పైసల కోసం కొట్లాట జరిగేదే కాదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దేవుళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ నేతలు వక్రీకరిస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.