TPCC Chief Mahesh Goud: భారత్ ఎదుగుదలకు నెహ్రూ విధానాలే పునాది
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:50 AM
నాడు ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ అవలంభించిన విధానాలతో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం లభించిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్.....
స్వాతంత్య్ర పోరాటం, దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఎనలేనిది: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నాడు ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ అవలంభించిన విధానాలతో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం లభించిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో గుండు సూది తయారు చేయలేని స్థితి నుంచి నేడు రాకెట్ ప్రయోగాల వరకు దేశం ఎదగడానికి నెహ్రూ వేసిన పునాదులే కారణమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో, అనంతరం దేశ నిర్మాణంలోనూ కాంగ్రెస్ పాత్ర ఎనలేనిదన్నారు. 141వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, నెహ్రూ, పటేల్ విగ్రహాలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, వివేక్ వెంకట్‌స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఇటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మోతే రోహిత్‌పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆనాడు నెహ్రూ ప్రధాని కానిపక్షంలో దేశ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేమన్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ అంటే పాకిస్థాన్ గడగడలాడేదని, కానీ నేడు మోదీ పాక్‌కు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దేశం సామాన్యుల చేతికి రావాలని బ్యాంకుల జాతీయీకరణ ఇందిరాగాంధీ చేస్తే.. సాంకేతికతను రాజీవ్‌గాంధీ పరిచయం చేశారన్నారు. ఆర్థిక సంస్కరణలతో పీవీ నరసింహారావు దేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారని.. కానీ నేడు మోదీ మాత్రం గాంధీ పేరు తొలగించి ఉపాధి పథకాన్ని నీరు గారుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పెత్తందారు పార్టీగా మారిందని, పేదలను దోచి అదానీ-అంబానీలకు కట్టబెడుతోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని, అందులో ఉండటం మన అదృష్టమన్నారు. రానున్న రోజుల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి అందరం సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి సెక్రటేరియెట్ వరకు తలపెట్టిన ర్యాలీని మహేశ్ గౌడ్ ప్రారంభించారు.
ప్రజా నేత పీజేఆర్..
ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప ప్రజానేత పీజేఆర్ అని.. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని మహేశ్‌గౌడ్ కొనియాడారు. పీజేఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకిచ్చే నివాళి అని అన్నారు. పీజేఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి మహేశ్ గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చుతూ కృష్ణా, గోదావరి జలాలు తరలించడంలో పీజేఆర్ కృషి ఎనలేనిదన్నారు.