Minister Jupalli: ఆర్థిక రంగానికి ఊతం పర్యాటకమే
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:56 AM
తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, ఆర్థిక రంగానికి పర్యాటక రంగం ఊతంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు....
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, ఆర్థిక రంగానికి పర్యాటక రంగం ఊతంగా నిలుస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 2047 నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ‘తెలంగాణ అనుభవాలు - వారసత్వం, సంస్కృతి - ఫ్యూచర్ రెడీ టూరిజం’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంత్రి జూపల్లి కీలకోపన్యాసం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వనరులు తక్కువగా ఉన్న అనేక దేశాలు పర్యాటకాన్ని ప్రధాన వనరుగా చేసుకొని అద్భుతమైన ఆర్థిక పురోగతి సాధించాయని చెప్పారు. తెలంగాణలోనూ ఈ రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.
పర్యాటకంలో రూ.7.045 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెలు ముందుకు వచ్చాయి. పర్యాటక రంగంలో 7.045 కోట్లకు పైగా పెట్టుబడులకు అంగీకారం కుదిరింది. సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్, మంత్రి జూపల్లి సమక్షంలో దేశీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పెట్టుబడులకు సంబంధించి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులతో 40 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. ఇందులో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆశిస్తున్నారు.