Hyderabad Elections: హోరాహోరీ!
ABN , Publish Date - Nov 12 , 2025 | 03:01 AM
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది..
3,4 డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ
మెజారిటీలపై పార్టీ నేతల అంచనాలు
హైదరాబాద్ సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ముగిసింది. జూబ్లీహిల్స్ పరిధిలో ఆరు డివిజన్లు ఉండగా.. మూడు, నాలుగు డివిజన్లలో ప్రధాన పార్టీల అభ్యర్థుల నడుమ హోరాహోరీ పోరు సాగినట్లు తెలుస్తోంది. ఎర్రగడ్డ, బోరబండ, వెంగళ్‌రావునగర్, షేక్‌పేట్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య నువ్వా.. నేనా.. అన్నట్లుగా పోటీ సాగినట్లు కనిపించింది. ఆయా డివిజన్లలో ఓటర్లు సైతం అభ్యర్థులవారీగా విడిపోయి ఓట్లు వేసినట్లు ప్రచారం జరిగింది. తమకు అనుకూలంగా ఉన్న పార్టీకి ఓటేసిన కొందరు నేరుగా చెప్పడంతో అక్కడ ఆ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుందనే దానిపై ముఖ్య నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు పోలింగ్ బూత్‌ల వద్ద తమ అనుచరులతో రహస్యంగా సర్వే నిర్వహించినా.. ఎవరికి ఓటు వేశామనే విషయాన్ని చాలామంది వెల్లడించలేదు. కొంతమంది నచ్చిన వారికి వేశామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. కొందరు మాత్రం ఫలానా అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిస్తే తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఇక ఓటర్ల పని ముగిసింది. ఇప్పుడు అభ్యర్థుల్లో ఆందోళన 14 తేదీ వరకూ కొనసాగనుంది. బస్తీలు, కాలనీలవారీగా జరిగిన ఓటింగ్ సరళిని అంచనా వేసుకుంటున్న కొంతమంది గెలుస్తామా.. లేదోననే టెన్షన్‌తో సతమతమవుతున్నారు. ఫలానా చోట మనకు మంచి స్పందన ఉందని.. అక్కడ మెజార్టీ ఎక్కువే వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో తగ్గే అవకాశం ఉందని అనుచరులు చెబుతున్న మాటలతో ఆందోళన పడుతున్నారు.