Share News

Telangana Elections: నేతలంతా అక్కడే!

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:40 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో....

Telangana Elections: నేతలంతా అక్కడే!

  • జూబ్లీహిల్స్‌లో ప్రధాన పార్టీల మోహరింపు

  • రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు

  • త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రోడ్‌ షో!

  • పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్‌ పాల్గొనే చాన్స్‌

  • బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్‌ సీఎంలు వచ్చే అవకాశం

  • రసవత్తరంగా మారనున్న ఉప ఎన్నిక ప్రచారం

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నిక ఫలితం ప్రభావం వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఉంటుందన్న అంచనాతో ఆయా పార్టీలు దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షానికి చెక్‌ పెట్టేందుకు అధికార కాంగ్రెస్‌, ఈ రెండు పార్టీలకు దీటుగా నిలిచామన్న సంకేతాన్నిచ్చేందుకు బీజేపీ.. ప్రచార వ్యూహ, ప్రతివ్యూహాలకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మూడు పార్టీలు.. అగ్ర నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు సీనియర్లు, అనుబంధ విభాగాల నాయకులకు బాధ్యతలు అప్పగించాయి. మంగళవారం నామినేషన్‌ల దాఖలు పర్వం ముగియగా.. ఇక ప్రచారపర్వం జోరందుకోనుంది. కాంగ్రెస్‌ పాలనకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక లిట్మస్‌ టెస్టుగా మారడంతో.. సీఎం రేవంత్‌రెడ్డి దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రెండు నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, వివేక్‌ వెంకటస్వామికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వారికి సహకారం అందించేందుకు డివిజన్ల వారీగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఇన్‌చార్జులుగా నియమించారు. రెండు నెలలుగా వారు నియోజకవర్గ ఓటర్లను కలుస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇతర మంత్రులు కూడా సమయం చూసుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క మంగళవారం బోరబండలో ప్రచారం నిర్వహించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌, జూపల్లి కృష్ణారావు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తాము ప్రభావితం చేయగలిగిన ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.


రంగంలోకి కేసీఆర్‌..!

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సీనియర్‌ నేత హరీశ్‌రావు ఇప్పటికే ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తుండగా, ఒకటి రెండు సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. బీఆర్‌ఎస్‌ వెల్లడించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో ఇంకా కేటీఆర్‌, హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారు. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా, ప్రతి 6వేల ఓటర్లకు ఒక నాయకుడికి బాధ్యతను అప్పగించింది.

బీజేపీ ప్రచారానికి కేంద్ర మంత్రులు..

బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, బండి సంజయ్‌, అర్జున్‌రాం మేఘవాల్‌, శ్రీనివాస వర్మ, ఎంపీలు కె.లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, తేజస్వి సూర్య, ధర్మపురి అర్వింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, ఆర్‌ .కృష్ణయ్య, జి.నగేశ్‌, పురందేశ్వరి ప్రచారం చేయనున్నారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోనే జుబ్లీహిల్స్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఉన్న నేపథ్యంలో ఆయన ఇప్పటికే పార్టీ క్యాడర్‌తో పలుమార్లు సమీక్షలు నిర్వహించి ప్రచారాన్ని వ్యూహాత్మకంగా కొనసాగిస్తున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు నియోజకవర్గంలోని ఏడు డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన పలువురు సీనియర్‌ నాయకులకు పోలింగ్‌ బూత్‌, శక్తి కేంద్రాల బాధ్యతలు అప్పగించారు. ప్రచార సరళికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇప్పటికే పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేశారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్‌ శంకర్‌, ఎంపీ రఘునందన్‌రావు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు గౌతంరావు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇక ప్రచారానికి రాజస్థాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ హాజరుకానున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.


హోటళ్లు.. ఓయో రూమ్‌లు ఫుల్‌!

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం కోసం మూడు ప్రధాన పార్టీలు తమ ముఖ్య నేతలు, కార్యకర్తలను హైదరాబాద్‌లోనే మోహరించడంతో.. నియోజకవర్గంలోని హోటళ్లు, ఓయో రూమ్‌లను గంపగుత్తగా నెల రోజులపాటు బుక్‌ చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు ఇక్కడ నివాసాలు ఉండడంతో ప్రతి రోజూ జూబ్లీహిల్స్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలను రంగంలోకి దింపడంతో స్థానికంగా ఉన్న టిఫిన్‌ సెంటర్లు, భోజన హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం-రాత్రి భోజనాలు అందించేందుకు పలు ఫంక్షన్‌హాళ్లను ఓ పార్టీ నేతలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. లేదంటే ఒక చోట వంటలు చేసి.. బూత్‌ల వారీగా ఏర్పాటు చేస్తున్న పార్టీ కార్యాలయాల వద్దకు టిఫిన్లు, భోజనాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మరో పార్టీ నేతలైతే.. వివిధ ప్రాంతాల వారీగా టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లతో మాట్లాడుకొని అక్కడి నుంచి కార్యకర్తలకు, నేతలకు టిఫిన్లు, భోజనాలు అందించడానికి కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Oct 22 , 2025 | 04:40 AM