Tollywood Producers Rally: ఫిల్మ్‌చాంబర్‌ను కాపాడుకుంటాం
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:47 AM
నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాలని, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి (ఫిల్మ్ చాంబర్)ని కాపాడుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు....
అంగుళం కూడా బయటవాళ్లకు దక్కనివ్వం.. డెవల్‌పమెంట్ పేర ఎవరికో కట్టబెడతారా?
చాంబర్ భవనాన్ని నవీకరించాలి.. టాలీవుడ్ ప్రముఖుల డిమాండ్.. కొవ్వొత్తుల ర్యాలీ
(సినిమా డెస్క్)
నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాలని, తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి (ఫిల్మ్ చాంబర్)ని కాపాడుకోవాలని సినీ ప్రముఖులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిల్మ్‌చాంబర్ ఆవరణలో పలువురు టాలీవుడ్ నిర్మాతలు సోమవారం ‘సేవ్ ఫిల్మ్ చాంబర్.. బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ’ అంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన సమయంలో ఫిల్మ్ చాంబర్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీ ఎకరా స్థలాన్ని చాంబర్‌కు 30 ఏళ్లకు లీజుకిచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరితో లీజు గడువు ముగుస్తుండడంతో ఆ స్థలాన్ని అభివృద్ధి చేయాలని సొసైటీ ప్రయత్నిస్తోంది. అక్కడ వాణిజ్య భవన సముదాయం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సినీ పరిశ్రమ కోసం ఇచ్చిన స్థలాన్ని సినిమా బాగు కోసమే వాడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడం కోసం నాటి ఏపీ ప్రభుత్వం పరిశ్రమ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలు కేటాయించిందన్నారు. ఇందులోనే ిఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీని కూడా 40 ఏళ్ల కిందట ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం ఫిల్మ్‌చాంబర్ భవనాన్ని చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాలకే వాడాలన్నారు. ప్రస్తుత నిర్మాతల మండలి మాత్రం డెవల్‌పమెంట్ పేరిట ఇతరులకు అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇందులో 75 శాతం నిర్మాణదారుడికి 25 శాతం నిర్మాతల మండలికి చెందేలా ఒప్పందం కూడా సిద్ధమైనట్లు తెలిసిందని.. ఈ విషయంపై సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘‘అంగుళం కూడా బయటవాళ్లకు దక్కనివ్వం. ప్రతి అంగుళం సినీ పరిశ్రమకు సంబంధించిందే ఉండాలి తప్ప, బయటవాళ్లకు ఎవరికో డెవల్‌పమెంట్‌కు ఇవ్వడం కుదరదు. చాంబర్, కౌన్సిల్, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఎడిటింగ్ రూమ్స్ ఇలా అన్నీ సినీ రంగానికి సంబంధించినవే ఉండాలి. బయటవి ఏవీ రావడానికి వీల్లేదు. ఈ భవనం కట్టి దాదాపు 40 ఏళ్లవుతోంది. దీన్ని నవీకరించి, పార్కింగ్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. సినీ పరిశ్రమకు చెందిన అన్ని సంస్థలూ ఇక్కడే ఉండేలా చూడాలి. ఏఐ లాంటి సాంకేతికత కోసం శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి’’ అని మురళీమోహన్ సూచించారు.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు
నిర్మాతల మండలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని నిర్మాత సురేశ్‌బాబు చెప్పారు. నిర్మాతల మండలికి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చేయాలనుకుంటే పూర్తిగా సినీ పరిశ్రమకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప ఎవరికో ప్రయోజనం చేకూర్చేలా ఉండకూడదని స్పష్టం చేశారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను ఇంటర్నేషనల్ సినీ హబ్‌గా చేస్తామన్నారు. ఆయన చెప్పినట్లు దీన్ని పరిశ్రమ బాగుకు ఉపయోగించాలి’’ అని నటుడు, నిర్మాత అశోక్ కుమార్ అన్నారు. చెన్నై నుంచి వచ్చి సినీ పరిశ్రమ ఇక్కడ నిలదొక్కుకోవడానికి కారణం ఈ భవనమేనని చెప్పారు. దీన్ని కాపాడుకోవడానికి పెద్దలంతా కలసి ఆలోచన చేయాలని కోరారు. ‘చాంబర్ ఇక్కడే కొనసాగాలని అందరూ కోరుకుంటున్నారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేలా నిర్ణయాలు ఉండాలి’ అని చాంబర్ మాజీ అధ్యక్షుడు కె.బసిరెడ్డి అన్నారు.
చర్చలకు సిద్ధం: సొసైటీ
సినీ ప్రముఖుల నిరసనపై ఫిల్మ్‌నగర్ హౌసింగ్ సొసైటీ స్పందించింది. అందులో పాల్గొన్నవారు నిర్మాతలు కాకముందే తమ సొసైటీ సభ్యులని, ఏమైనా అభ్యంతరాలుంటే జనరల్ బాడీ సమావేశంలో చర్చించవచ్చని సొసైటీ పాలకమండలి సూచించింది.