Tight Security and Technology: నిఘా నీడలో జూబ్లీహిల్స్
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:39 AM
రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం....
నేడే ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 7నుంచి 6 గంటల వరకుఛ
అడుగడుగునా పోలీస్ బందోబస్తు
సుమారు 800 సీసీటీవీ కెమెరాలు..
కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
తొలిసారిగా డ్రోన్లతో పోలింగ్ పర్యవేక్షణ
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/యూసు్‌ఫగూడ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నియోజకవర్గంలో 4,01,635 ఓటర్లు ఉండగా.. 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు. మొత్తం 2060 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా, 2వేల మంది పోలీసులు బందోబస్తు బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 67 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన దృష్ట్యా.. ఎనిమిది కంపెనీల కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నామని తెలిపారు. అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు డ్రోన్లను వినియోగించేందుకు అనుమతి లేదన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పర్యవేక్షించనున్నారు. సోమవారం సాయంత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి మొదటి పటాలం మైదానంలో డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల నిర్వహణ, పరిశీలనను ఎన్నికల ప్రధాన అదికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి, ఆర్‌వీ కర్ణన్ ప్రారంభించారు. మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గమంతా నిఘా నీడలో ఉండనుంది.
800 సీసీ కెమెరాలతో
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలు మొరాయించినా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా పరిష్కరించేందుకు ఈసీఐఎల్‌కు చెందిన 40 మంది ఇంజనీర్లు అందుబాటులో ఉంటారు. శాంతి భద్రతల వంటి సమస్యలు తలెత్తితే డయల్ 100, 1950కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులతోపాటు.. కేంద్ర సాయుధ బలగాలు డేగ కళ్లతో పహారా కాస్తుంటాయని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాల పరిసరాలతో పాటు.. ఇతర ప్రధాన రూట్లలో కలిపి సుమారు 800 వరకు సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 68 సమస్యాత్మక పోలింగ్ ేస్టషన్ల వద్ద సీఆర్‌పీఎఫ్ బలగాలతో గట్టి భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలింగ్ నేపథ్యంలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు ఉన్నవారికి సెలవు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలకూ జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 47.58 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి ఎంత శాతం ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.