Tiger Safari Reopens in Amrabad Sanctuary: నల్లమలను చూసొద్దాం రండి
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:20 AM
దేశంలోనే రెండో అతి పెద్దదైన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో బుధవారం నుంచి టైగర్ సఫారీ పునఃప్రారంభం కానుంది....
నేటి నుంచి పునఃప్రారంభం కానున్న టైగర్ సఫారీ
ఒక్కో వాహనంలో ఏడుగురు ప్రయాణికులు
ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం
మన్ననూర్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే రెండో అతి పెద్దదైన నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యం (ఏటీఆర్)లో బుధవారం నుంచి టైగర్ సఫారీ పునఃప్రారంభం కానుంది. పెద్ద పులులతో పాటు ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని జూలై 1 నుంచి సెప్టెంబరు 30 వరకు 3 నెలల పాటు నల్లమల అడవిలోకి పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు. ఈ నిషేధ సమయం ముగియడంతో సఫారీ సేవలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ సంవత్సరం ఆఫ్‌లైన్ సేవలను అటవీ శాఖ నిర్వహిస్తుండగా, ఆన్‌లైన్ సేవలను ఫారెస్ట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ)కు అప్పగించారు. ఆన్‌లైన్ సేవల్లో భాగంగా అమ్రాబాద్ టైగర్ స్టే పేరిట కాటేజీలలో బస సౌకర్యం కల్పిస్తారు. పర్యాటక వన మాలికలోని కాటేజీల అప్‌గ్రేడ్ పనులు పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
సఫారీ ధరల పెంపు
ఈ ఏడాది టైగర్ సఫారీలో ట్రిప్‌ల వారీగా ధరలను పెంచారు. ఫర్హాబాద్ చౌరస్తా నుంచి వ్యూపాయింట్ వరకు వెళ్లి తిరిగి చౌరస్తాకు రావడానికి (18 కి.మీ) రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. మరో ట్రిప్‌లో ఫర్హాబాద్ చౌరస్తా నుంచి వ్యూపాయింట్ మీదుగా గుండం అటవీ మార్గంలో తిరిగి రావడానికి (28 కి.మీ) రూ.5000 రుసుము నిర్ణయించారు. ఒక్కో సఫారీ వాహనంలో ఏడుగురు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. వాహనంలో డ్రైవర్‌తో పాటు, ఒక నేచర్ గైడ్ ఉంటారు.