Dirt Bike Stunts: రయ్.. రయ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:58 AM
రయ్ రయ్‌మంటూ గాల్లో దూసుకెళ్లిన డర్ట్ బైక్‌ల మోత.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ బైకర్లు చేసిన విన్యాసాలు.. బాలీవుడ్ స్టార్ హీరో సందడి వెరసి...
ఉర్రూతలూగించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్
అబ్బురపరిచిన బైకర్ల విన్యాసాలు
రేసును ప్రారంభించిన సీఎం రేవంత్
మైదానంలో సల్మాన్‌ఖాన్ సందడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): రయ్ రయ్‌మంటూ గాల్లో దూసుకెళ్లిన డర్ట్ బైక్‌ల మోత.. మెరుపు వేగంతో దూసుకెళ్తూ బైకర్లు చేసిన విన్యాసాలు.. బాలీవుడ్ స్టార్ హీరో సందడి వెరసి ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ (ఐఎ్‌సఆర్‌ఎల్) రెండో రౌండ్ పోటీలు హైదరాబాదీలను ఉర్రూతలూగించాయి. బైకి రేసింగ్ మజాను అందించాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ప్రధాన స్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీలను జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి రేస్‌ను ఆసక్తిగా తిలకించారు. 450 సీసీ, 250 సీసీ ఇంటర్నేషనల్, 250 సీసీ ఆసియా-ఇండియా విభాగాల్లో రేసులు జరిగాయి. ఇందులో బైక్ జంప్స్, రిథమ్ జంప్స్, ట్రిపుల్ జంప్స్, వూప్ సెక్షన్స్, ఫ్రీస్టయిల్ మోటర్‌క్రాస్ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు 18 వేల మంది హాజర్వగా.. బైకర్ల మోత, అభిమానుల హోరుతో స్టేడియం మార్మోగిపోయింది. పోటీల ప్రారంభానికి ముందు, చివరిలో నిర్వహించిన లేజర్ షో అభిమానులను అలరించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ క్రీడాశాఖ సలహదారు ఏపీ జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరుల ఈ పోటీలను వీక్షించారు. కాగా, రెండో రౌండ్ పోటీల్లో టీమ్ గుజరాత్ ట్రయల్ బ్లేజర్స్ విజేతగా నిలిచి, మొత్తంగా 212 పాయింట్లతో లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇండీ వీలర్స్ జట్టు 210 పాయింట్లతో ద్వితీయ స్థానంలో, బిగ్‌రాక్ జట్టు 202 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచాయి. ఆఖరిదైన మూడో రౌండ్ పోటీలు ఈనెల 20, 21 తేదీల్లో కేరళలోని కాలికట్‌లో జరగనున్నాయి.