Water Tank Construction Accident: ముగ్గురి ఉసురు తీసిన ట్యాంకు
ABN , Publish Date - Sep 10 , 2025 | 04:11 AM
నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకు ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లిలో...
మోటారు ఆన్ చేసేందుకు లోపలికి వెళ్లి ఊపిరాడక మృతి
మరొకరికి అస్వస్థత.. మృతుల్లో ఒకరిది ఏపీలోని తణుకు?
చర్ల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నిర్మాణంలో ఉన్న వాటర్ ట్యాంకు ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లిలో ఈ విషాద ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు కూలీలు, మరొకరు రైతు. ఉంజుపల్లిలో మిషన్ భగీరథ పథకం కింద 90వేల లీటర్ల సామర్థ్యంతో కూడిన వాటర్ ట్యాంకును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం స్లాబ్ వేసే పనులు జరుగుతున్నాయి. మంగళవారం ట్యాంకులోని నీటిని తొలగించేందుకుగాను అందులో ఉన్న డీజిల్ మోటారును ఆన్ చేసేందుకు తొలుత కార్మికుడు నీలం తులసీరాం (37) దిగాడు. లోపల ఊపిరాడకపోవడంతో బిగ్గరగా కేకలు వేస్తూ పడిపోయాడు. ఇది గమనించిన కార్మికులు ఇసాక్ (50), అప్పలరాజు లోపలికి దిగారు. ఊపిరాడకపోవడంతో వారూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. కార్మికులు కేకలు వేయడంతో అదే దారిన వెళ్తున్న రైతు కాకా మహేశ్ (36) వారిని కాపాడేందుకు లోపలికి దిగాడు. ఈ క్రమంలో మహేశ్ కూడా ఊపిరాడక పడిపోయాడు. దీనిపై చర్ల పోలీసులకు సమాచారం అందడంతో వారొచ్చి.. నలుగురినీ బయటకు తీశారు. అప్పటికే తులసీరాం, మహేశ్ మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇసాక్, అప్పలరాజును భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఇసాక్ మార్గమధ్యలోనే మృతిచెందారు. అప్పలరాజు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. తులసీరాంది చర్ల మండలం లింగాపురం. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మహేశ్‌ది ఉంజుపల్లి. అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఇసాక్ స్వస్థలం ఏపీలోని తణుకుగా తెలుస్తోంది. చికిత్స పొందుతున్న అప్పలరాజుది కూడా ఏపీలోని కాకినాడ అని తెలుస్తోంది.