Child Abuse: బడి ఎగ్గొట్టి సరదాగా బయటకు వెళితే..
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:41 AM
ఆ ముగ్గురు బాలికలు తొమ్మిదో క్లాసు చదువుతున్నారు. బడికి వెళ్తున్నామని ఇంట్లోవాళ్లకు చెప్పి.. వెళ్లకుండా సరదాగా బయట తిరిగారు....
తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ ముగ్గురు తొమ్మిదో క్లాసు బాలికలు.. వారికి మాయమాటలు చెప్పిన ముగ్గురు యువకులు
ఆరుగురు కలిసి యాదగిరిగుట్టకు.. లాడ్జిలో గది అద్దెకు.. రాత్రంతా అక్కడే
మర్నాడు ఇంటికి బాలికలు..
కన్నవారు నిలదీయడంతో అత్యాచారం జరిగినట్లు వెల్లడి
నిందితుల అరెస్టు.. పోక్సో కేసు నమోదు.. లాడ్జి యజమాని అరెస్టు
అల్వాల్, హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆ ముగ్గురు బాలికలు తొమ్మిదో క్లాసు చదువుతున్నారు. బడికి వెళ్తున్నామని ఇంట్లోవాళ్లకు చెప్పి.. వెళ్లకుండా సరదాగా బయట తిరిగారు. బాలికలను మాటల్లో పెట్టిన ఓ ముగ్గురు యువకులు వారిని యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. మర్నాడు ఇంటికి తిరిగొచ్చిన ఆ బాలికలు.. ఎక్కడికి వెళ్లారు? అని గట్టిగా నిలదీయడంతో తమపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. అల్వాల్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదన, ఆందోళనకు గురిచేసింది. ఆల్వాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముగ్గురు బాలికలు కూడా ఒకే పాఠశాలలో చదువుతున్నారు. బడిలో బతుకమ్మ ఉత్సవాలపై ప్రత్యేక కార్యక్రమాలున్నాయని ఇంట్లోవాళ్లకు చెప్పి ఈనెల 20న ఉదయం 7:30కే ఆధార్ కార్డులు పట్టుకొని బయటకొచ్చారు. స్కూలుకు వెళ్లకుండా ఆల్వాల్ గోల్నాక చౌరస్తావద్ద బస్సెక్కి సికింద్రాబాద్‌కు వెళ్లారు. అక్కడి నుంచి మరో బస్సులో ఉస్మానియా వర్సిటీ పీఎస్ ప్రాంతంలో దిగారు. దగ్గర్లోని ఓ బస్టాపు వద్ద నిల్చున్నారు. ఓయూ మాణికేశ్వరి నగర్ వాస్తవ్యుడు, జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడు బాలికలను చూసి వారితో మాట లు కలిపాడు. అనంతరం.. వారాసిగూడ పెట్రోల్ బంక్‌లో పనిచేసే 21 ఏళ్ల స్నేహితుడికి, మల్లేశ్వర్‌నగర్‌కు చెందిన 22 ఏళ్ల స్నేహితుడికి ఫోన్ చేసి అక్కడికి పిలిపించుకున్నాడు. తన ఇద్దరు స్నేహితులను అతడు బాలికలకు పరిచయం చేశాడు. మాటల్లో.. ఆ బాలికలు యాదగిరిగుట్టకు వెళుతున్నారని తెలుసుకొని, తామూ అక్కడికి వెళుతున్నామని వారిని ఆ ముగ్గురు యువకులు నమ్మించారు. ఆరుగురు కలిసి బస్సులో యాదగిరిగుట్టకు వెళ్లారు. గుట్టపై దర్శనం అనంతరం లాడ్జ్‌లో గదికి అద్దెకు తీసుకున్నాడు. రాత్రంతా ఆ గదిలోనే ఉన్నారు. 21వ తేదీన ఆరుగురు కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఓయూ పీఎస్ పరిధిలో బాలికలను వదిలిపెట్టి, ముగ్గురు యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతకుముందు రోజు.. బాలికలు బడికి రాకపోవడంతో ఓ టీచర్.. తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. పిల్లలు బడికి వెళ్లలేదని తెలిసి ఆందోళనకు గురైన బాలికల తల్లిదండ్రులు స్నేహితుల ఇళ్లలో వాకబు చేసిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మర్నాడు ఆదివారం ఓయూ పీఎస్ పరిధిలోంచి బాలికలే తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారు గట్టిగా నిలదీసేసరికి.. జరిగిదంతా చెప్పారు. తమపై యువకులు పాల్పడ్డ దారుణాన్ని కన్నవారికి వెల్లడించారు. ముగ్గురు యవకులను పోలీసులు గుర్తించి.. వారిని అరెస్టు చేశారు. ఆ ముగ్గురిపైనా పోక్సో కేసు నమోదు చేశారు. యువకుల వెంట బాలికలు ఉన్నారని తెలిసి కూడా యాదగిరిగుట్టలో గదిని అద్దెకు ఇచ్చిన యజమాని సోమేశ్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.