Share News

TPSC: టీజీపీఎస్సీలో మరో ముగ్గురు సభ్యులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 07:32 AM

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో మరో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

TPSC: టీజీపీఎస్సీలో మరో ముగ్గురు సభ్యులు

  • ఐపీఎస్‌ అధికారి విశ్వప్రసాద్‌, సి.చంద్రకాంత్‌ రెడ్డి, ఎల్బీ లక్ష్మీకాంత్‌ నియామకం

  • ఉత్తర్వులు జారీ.. కమిషన్‌లో ఆరుకు చేరిన సభ్యుల సంఖ్య

హైదరాబాద్‌, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో మరో ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఐపీఎస్‌ అధికారి విశ్వప్రసాద్‌, సి.చంద్రకాంత్‌ రెడ్డి, ఆచార్య ఎల్బీ. లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ఉన్నారు. వీరు ఆరు సంవత్సరాలు లేదా 62 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం కమిషన్‌లో సభ్యులుగా అమీరుల్లాఖాన్‌, ఆచార్య నర్రి యాదయ్య, పాల్వాయి రజని కుమారి ఉన్నారు. కొత్త సభ్యులతో టీజీపీఎస్సీలో సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. కాగా కొత్తగా నియామకమైన సభ్యుల్లో ఆచార్య లక్ష్మీకాంత్‌ స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా. నిరుపేద గిరిజన కుటుంబంలో జన్మించారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశారు. అంతకుముందు ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ప్రిన్సిపల్‌గా పనిచేశారు. ఐపీఎస్‌ అధికారి విశ్వప్రసాద్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2005 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన విశ్వప్రసాద్‌, ఈ ఏడాది డిసెంబరులో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. సి.చంద్రకాంత్‌ రెడ్డి మునిసిపల్‌ పాలన, పట్టణ అభివృద్ధి శాఖలో పనిచేశారు. జీహెచ్‌ఎంసీ అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ అడిషనల్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చంద్రకాంత్‌ రెడ్డికి మరో మూడేళ్ల సర్వీసు ఉంది.

Updated Date - Sep 23 , 2025 | 07:34 AM