Global summit security: మూడంచెల భద్రతా వలయం
ABN , Publish Date - Dec 08 , 2025 | 04:05 AM
గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా వ్యూహన్ని రచించారు. సమ్మిట్ రక్షణ విధుల్లో 6 వేల మంది సివిల్, సాయుధ పోలీసులను నియమించారు......
ఆరు వేల మంది పోలీసులతో భద్రత
18 సెక్టార్లుగా విభజన... డ్రోన్లతోనూ పహారా
కంట్రోల్ రూమ్‌కు 1000 కెమెరాల అనుసంధానం
హైదరాబాద్, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): గ్లోబల్ సమ్మిట్ సజావుగా సాగేందుకు పోలీసు శాఖ ఉన్నతాధికారులు పటిష్ఠ భద్రతా వ్యూహన్ని రచించారు. సమ్మిట్ రక్షణ విధుల్లో 6 వేల మంది సివిల్, సాయుధ పోలీసులను నియమించారు. సమ్మిట్ ప్రాంతాన్ని 18 సెక్టార్లగా విభజించి ఒక్కో సెక్టార్‌కు ఒక్కో ఐపీఎస్ ఆఫీసర్‌ను బాధ్యుడిగా నియమించారు. సమ్మిట్ రక్షణ విధుల్లో ముగ్గురు అదనపు డీజీపీలు, ఐదుగురు ఐజీపీలతోపాటు 18 మంది ఐపీఎస్ అధికారులు పాల్గొంటున్నారు. అనుమతిలేని వ్యక్తులు రాకుండా, ఎలాంటి అలజడులు, ఆందోళనలు జరగకుండా అడుగడుగునా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సమ్మిట్ పరిసర ప్రాంతాల్లోని గుట్టలపై సాయుధ పోలీసులు బైనాక్యులర్ల ద్వారా పహారా కాయనున్నారు. 165 నైట్ విజన్ కెమెరాలు సహా మొత్తం 1000 కెమెరాలను కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. వీటికి తోడు నిరంతరం డ్రోన్లతో పహారా ఏర్పాటు చేశారు. పది డ్రోన్ బృందాలను కమాండ్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులను నిర్దేశించిన హోటళ్లకు తీసుకుని వెళ్లే వరకు ఎస్కార్టుగా ఏసీపీ ఆధ్వర్యంలో సాయుధ పోలీసులను నియమించారు. హెలికాప్టర్లలో వచ్చే అతిథులను హెలీప్యాడ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని సమ్మిట్ ప్రాంతానికి ఎస్కార్టుగా సీనియర్ పోలీసు అధికారులు తీసుకుని వెళ్లనున్నారు. అగ్నిప్రమాదాల వంటి ఊహించని విపత్తులు సంభవిస్తే.. అతిథులను వాటి నుంచి కాపాడేందుకు కందుకూరు పోలీసు స్టేషన్‌ను సేఫ్ హౌస్‌గా మార్చారు. మాధవన్ ఆస్పత్రిని సేఫ్ హాస్పిటల్‌గా ఎంపిక చేసి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించే ప్రధాన హాల్‌లో రెండు వేల మంది ఆహ్వానితులు ఆసీనులు కావడానికి ఏర్పాట్లు చేశారు. అందుకు తగిన విధంగా అక్కడ మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి ఓ ప్రకటనలో వివరించారు. అలాగే.. సమ్మిట్‌కు దారితీసే 25 కిలోమీటర్ల మార్గంలో ఆరు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక డీసీపీ పర్యవేక్షణలో ఆరుగురు ఏసీపీలకు ఈ బాధ్యత అప్పగించారు.
అపరిచితులు ప్రవేశించకుండా దక్షిణ, తూర్పు మార్గాల్లో 7 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టారు. హెలీప్యాడ్, ప్రధాన సదస్సు జరిగే ప్రాంతం చుట్టూ అనుక్షణం సాయుధులైన ఫుట్ పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతుంటాయి. వీవీఐపీ పార్కింగ్‌ను వెయ్యి కార్లు నిలిపేలా సిద్ధం చేశారు. మరో మూడు చోట్ల ఏర్పాటు చేసిన పార్కింగ్ జోన్లలో 6వేల వాహనాలు నిలపడానికి ఏర్పాట్లు చేశారు. టీజీఐఐసీకి సంబంధించిన స్ధలంలో మరో 2వేల అదనపు వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. డీసీపీ స్థాయి అధికారి ట్రాఫిక్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. సమీప గ్రామాల నుంచి ఆందోళనలకు ఎవరు రాకుండా చూడటానికి నాలుగు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలో దించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముగ్గురు ఏసీపీలు, 50 మంది ఇతర అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు 3ప్లాటూన్ల ఆక్టోపస్ బలగాలను మోహరించారు. 3 ప్లాటూన్ల గ్రేహౌండ్స్‌ను రంగంలో దించారు. కమ్యూనికేషన్ నిమిత్తం అత్యాధునిక పరికరాలను వాడుతున్నారు. 150మంది పోలీసులు కమ్యూనికేషన్ విభాగంలో బాధ్యతలు నిర్వహించనున్నారు. బందోబస్తు విధుల్లో 25మంది డీసీపీ స్ధాయి అధికారులు, 17 మంది ఎడీసీపీలు, 51 మంది ఏసీపీలు, 98మంది ఇన్‌స్పెక్టర్లు, 266 మంది ఎస్సైలను నియమించారు.