Congress Majority in Jubilee Hills: మురిపించిన 3డివిజన్లు
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:22 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించి, బీఆర్‌ఎ్‌సకు చెందిన సిట్టింగ్ స్థానాన్ని ఎగరేసుకుపోయింది...
కాంగ్రెస్ మొత్తం మెజార్టీలో వాటి నుంచే
61 శాతం దన్నుగా నిలిచిన రహమత్‌నగర్, యూసు్‌ఫగూడ, వెంగళరావునగర్
హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రతినిధి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించి, బీఆర్‌ఎ్‌సకు చెందిన సిట్టింగ్ స్థానాన్ని ఎగరేసుకుపోయింది. అయితే, ఇక్కడి ఓట్ల గణాంకాలు విప్పుతున్న గెలుపు గుట్టు ఏమిటి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం ఆరు డివిజన్ల ఉండగా.. సోమాజిగూడ డివిజన్ కొంత భాగం కూడా నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు వచ్చిన మెజార్టీలో కీలక భూమిక పోషించింది మాత్రం రహమత్ నగర్ డివిజన్. ఇక్కడ 6,025 ఓట్ల మెజార్టీని ఆయన సొంతం చేసుకున్నారు. మొత్తం ఆరున్నర డివిజన్లలో కేవలం మూడు డివిజన్లలో వచ్చిన మెజార్టీనే మొత్తం మెజార్టీలో 61 శాతం కావటం విశేషం. రహమత్ నగర్, యూస్‌ఫగూడ, వెంగళరావునగర్‌లలో వచ్చిన ఆధిక్యత కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీని పాతిక వేల మార్కుకు దగ్గరగా తీసుకొచ్చింది.ఉత్సాహాన్ని ఇచ్చిన షేక్‌పేటగత అసెంబ్లీ ఎన్నికల్లో షేక్‌పేట డివిజన్‌లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ అధిక్యత సాధించారు. అయితే, ఉప ఎన్నికలో ఇక్కడ తమకు మెజార్టీ వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. అదే సమయంలో బీఆర్‌ఎస్ వర్గాలు షేక్‌పేట డివిజన్‌లో తమకు 3 వేల వరకు మెజార్టీ వస్తుందని బలంగా నమ్మాయి. అంచనాలకు భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 1,940 మెజార్టీ రావటం గమనార్హం. షేక్‌పేట డివిజన్ మొత్తంలో 76 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ పరిధిలోకి వచ్చిన 42 కేంద్రాల్లో కలిపి కాంగ్రె్‌సకు 47 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే, వీటిలో బీఆర్‌ఎస్ కంటే కాంగ్రె్‌సకు ఎక్కువగా ఓట్లు వచ్చిన కేంద్రాలు 20 మాత్రమే. షేక్‌పేట డివిజన్‌లోని మిగిలిన పోలింగ్ కేంద్రాల ఓట్లను రెండు, మూడు రౌండ్లలో ఎర్రగడ్డ, వెంగళరావునగర్ డివిజన్ల పరిధిలోని మరికొన్ని పోలింగ్ కేంద్రాలతో కలిపి లెక్కించారు. కాంగ్రె్‌సకు అధిక మెజార్టీ వచ్చిన డివిజన్లలో వెంగళరావు నగర్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికలో కాంగ్రె్‌సకు రహమత్‌నగర్ కొండంత అండగా నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అత్యధికంగా 6,025 ఓట్ల మెజార్టీ లభించింది. క్వారీ స్థలాలు ఎక్కువగా ఉండే ఈ డివిజన్‌లో వడ్డెర సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉంటారు. ఈ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యనేత ఒకరు ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పని చేయటం ఆ పార్టీకి లాభించింది. ఈ ప్రాంతంలో పీజేఆర్ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారు. ఆయన శిష్యులు పలువురు కాంగ్రెస్ తరఫున పని చేయటం కూడా సానుకూల ఫలితానికి కారణమైంది. తమకు నష్టం చేసే డివిజన్లలో బోరబండ ఒకటి అని కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన ఉండేది. అయితే, స్థానిక నేతలను తమవైపు తిప్పుకోవటంలో విజయం సాధించటంతో కాంగ్రెస్ 2,842 ఓట్ల మెజార్టీ సాధించగలిగింది.
ఊహించని మెజార్టీ
ఓట్ల లెక్కింపులో రౌండ్ల వారీగా చూసినప్పుడు కాంగ్రెస్‌కు అత్యధిక మెజార్టీ ఏడో రౌండ్‌లో వచ్చింది. ఈ రౌండ్‌లో 4,000 వేల ఓట్ల మెజార్టీ సాధించింది. ఈ రౌండ్ పరిధిలోకి యూస్‌ఫగూడ, సోమాజిగూడ వస్తాయి. ఇందులో యూస్‌ఫగూడ తమకు అనుకూలంగా ఉంటుందని.. సోమాజిగూడలో వ్యతిరేక ఫలితం వస్తుందని కాంగ్రెస్ నేతలు భావించగా, అందుకు భిన్నంగా రెండు డివిజన్లలోనూ ఆ పార్టీకి ఆధిక్యత రావటం విశేషం.