Share News

Saudi Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి..

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:36 AM

సౌదీ బస్సు ప్రమాదం మాటలకందని విషాదం!! ఉవ్వెత్తున్న వరద తాకినట్టు.. కాదు కాదు అంతకుమించి మహా సునామీ పోటెత్తి అంతా తుడిచిపెట్టేసినట్టు ఒక కుటుంబాన్ని దాదాపు కూకటివేళ్లతో పెకిలించేసిందా రాకాసి ప్రమాదం! పెద్దదైన ఆ కుటుంబంలోని నిన్నటితరం....

Saudi Bus Accident: ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి..

  • మృతుల్లో 8మంది పెద్దవాళ్లు.. 10 మంది పిల్లలు

  • కుటుంబంలో మిగిలింది కేవలం ఇద్దరే

  • ఇంటివద్దే ఉండిపోవడంతో బతికిపోయిన ఇంటిపెద్ద తల్లి

  • విమాన టికెట్‌ దొరక్కపోవడంతో అమెరికాలోనే ఉండిపోయిన పెద్ద కొడుకు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సౌదీ బస్సు ప్రమాదం మాటలకందని విషాదం!! ఉవ్వెత్తున్న వరద తాకినట్టు.. కాదు కాదు అంతకుమించి మహా సునామీ పోటెత్తి అంతా తుడిచిపెట్టేసినట్టు ఒక కుటుంబాన్ని దాదాపు కూకటివేళ్లతో పెకిలించేసిందా రాకాసి ప్రమాదం! పెద్దదైన ఆ కుటుంబంలోని నిన్నటితరం, నేటి తరం, రేపటి తరం ఇలా మూడు తరాల వారంతా మృతిచెందడం మానవతావాదుల గుండెలను పిండేస్తోంది. ఎనిమిది మంది పెద్దలు, పది మంది పిల్లలు మొత్తంగా 18మంది బస్సు ప్రమాదంలో మృతిచెందారు. రైల్వేలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఇంటిపెద్ద అయిన 70 ఏళ్ల నసీరుద్దీన్‌ది పెద్ద కుటుంబమే! విద్యానగర్‌లో ఉంటున్న ఆయనకు వయసుపైబడిన తల్లి రోషన్‌ బీతో పాటు భార్య అక్తర్‌ బేగం (65), కుమారులు సిరాజుద్దీన్‌, సలావుద్దీన్‌ (42), కూతుళ్లు అమీనా బేగం (44), రిజ్వానా బేగం (38), షబానా బేగం (40) ఉన్నారు. నసీరుద్దీన్‌ పిల్లలందరికీ పెళ్లిళ్లయ్యాయి. పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌కు భార్య సన, ముగ్గురు పిల్లలు మెహరీన్‌ ఫాతిమా, ఉమైజా ఫాతిమా, ఉజైరుద్దీన్‌ షేక్‌ ఉన్నారు. చిన్న కుమారుడు సలావుద్దీన్‌కు భార్య ఫర్హానా, ముగ్గురు పిల్లలు షేక్‌ జైనోద్దీన్‌, రిధా తాజీమ్‌, వసీమా ఫర్హీన్‌ ఉన్నారు పెద్ద కుమార్తె అమీనాకు కూతురు అనీస్‌ ఫాతీమా, రెండో కుమార్తె షబానాకు కుమారుడు జాఫర్‌ సయ్యద్‌, మూడో కుమార్తె రిజ్వానాకు కూతురు మరియం ఫాతిమా, కుమారుడు షాజైన్‌ హమద్‌ ఉన్నారు. పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌ ఆయన భార్య సన, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమారుడు సలావుద్దీన్‌, కూతుళ్లు అమీనా, రిజ్వానా తమ తమ కటుంబాలతో నగరంలోనే వేర్వేరుగా ఉంటున్నారు. సలావుద్దీన్‌ అమెజాన్‌ సంస్థలో ఉన్నతోద్యోగి. తన కుటుంబసభ్యులందరినీ తోడ్కొని మక్కా యాత్ర చేసిరావాలని ఇంటిపెద్ద అయిన నసీరుద్దీన్‌ చిరకాల స్వప్నం! ఇందుకు ఆయన చాన్నాళ్లుగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి సిరాజుద్దీన్‌ భార్య సన, పిల్లలు మెహరీన్‌ ఫాతిమా, ఉమైజా ఫాతిమా, ఉజైరుద్దీన్‌ షేక్‌ హైదరాబాద్‌కొచ్చారు. సలావుద్దీన్‌కూ సెలవు దొరకడంతో మక్కా యాత్రకు మక్కా యాత్రకు ఇదే అనువైన సమయం అని నసీరుద్దీన్‌ అనుకున్నారు. సిరాజుద్దీన్‌కు అమెరికా నుంచి నేరుగా మక్కా రావాలని చెప్పారు. తన తల్లి రోషన్‌ బీని నసీర్దుదన్‌ తన సోదరి వద్ద వదిలిపెట్టారు. ఆ వెంటనే పిల్లలను వెంటబెట్టుకొని అంతా తన ఇంటికి రావాలని కొడుకు, కూతుళ్లకు నసీరుద్దీన్‌ కబురు పెట్టారు. ఈనెల 9న తాను, తన భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కోడళ్లు, ముగ్గురు కుమార్తెలు.. 10మంది మనుమలు, మనుమరాళ్లతో నసీరుద్దీన్‌ మక్కా బయలుదేరారు. 23న తిరిగిరావాలనుకున్నారు. అయితే వెళ్లినవారిలో ఒక్కరూ మిగలకుండా ప్రాణాలుకోల్పోయారు.


టికెట్‌ దొరక్కపోవడమే ప్రాణం నిలిపింది

వాస్తవానికి మక్కా యాత్రకు నసీరుద్దీన్‌ పెద్ద కుమారుడు సిరాజుద్దీన్‌ కూడా వెళ్లాలి. కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు రావాలనుకున్నా ఆయనకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో భార్యాపిల్లలను మాత్రం హైదరాబాద్‌కు పంపారు. తాను తర్వాత రావాలనుకున్నారు. అయితే మక్కా యాత్రకు ఆలోచన చేసిన నసీరుద్దీన్‌.. కుమారుడు సిరాజుద్దీన్‌ను అమెరికా నుంచి నేరుగా సౌదీకి వచ్చి.. తమతో కలవాలని చెప్పారు. అయితే అనుకున తారీఖున టికెట్‌ దొరక్కపోవడంతో సిరాజుద్దీన్‌ అమెరికాలోనే ఉండిపోయారు. ప్రస్తుతం ఇంట్లో నాన్నమ్మ (నసీరుద్దీన్‌ తల్లి) రోషన్‌ బీ, తాను మాత్రమే మిగిలారు. ప్రమాదంలో సిరాజుద్దీన్‌ భార్య సన, ముగ్గురు పిల్లలు మెహరీన్‌ ఫాతిమా, ఉమైజా పాతిమా, ఉజైరుద్దీన్‌ షేక్‌ మృతిచెందారు. సిరాజుద్దీన్‌ అమెరికా నుంచి సౌదీకి బయలుదేరారని.. అంత్యక్రియలను ఆయనే నిర్వహిస్తారని నగరంలోని బంధువులు వెల్లడించారు.

3.jpg

అందరూ ఒకేసారి ఎందుకు? అన్నా కూడా

ఇలా అవుతుందని కలలో కూడా అనుకోలేదు. ప్రమాదంలో మూడు తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. మా బావ (నసీరుద్దీన్‌) నా మాట వినుంటే కొందరైనా బతికేవారు. యాత్రకు ముందే బావతో నేను.. అందరూ ఒకేసారి వెళ్లడం ఎందుకు? వద్దు? అని చెప్పాను. మరీ ప్రత్యేకంగా.. పిల్లలందరినీ తీసుకెళ్లవద్దనీ చెప్పాను. ఆయన నా మాట వినలేదు. మా అక్క, బావ, పిల్లలతో శుక్రవారమే మాట్లాడాను. ఎంతో ఆనందంతో అక్కడి విషయాలెన్నో పంచుకున్నారు. అంతలోనే విషాదం జరిగింది.

- అక్తర్‌ బేగం సోదరుడు సయ్యద్‌


4.jpg

చివరి చూపూ దక్కడం లేదు

మా ఇంట్లో 18మంది కాలిబూడిదయ్యారు. వారి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాం. ఇక మాకు దిక్కెవరు? అల్లా ఎంత పనిచేశాడు?

-నసీరుద్దీన్‌ తల్లి రోషన్‌

పిల్లలంతా మృతి

ప్రమాదంలో నసీరుద్దీన్‌ మనుమలు, మనుమరాళ్లలో ఒక్కరూ మిగలకుండా అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కుమారుల పిల్లలు, ముగ్గురు కూతుళ్ల పిల్లలు అంతా మక్కా యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. తాత నసీరుద్దీన్‌.. మక్కా యాత్రకు వెళ్లనున్నామని చెప్పింది మొదలు ఆ చిన్నారులంతా ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ విషయాన్ని స్నేహితులతో గొప్పగా చెప్పుకొన్నారు. తిరిగివచ్చాక అక్కడి జ్ఞాపకాలను తమతో పంచుకుంటామని చెప్పిన దోస్తులు ఎన్నడూ తిరిగిరారని తెలిసి ఇరుగుపొరుగు పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు.

భార్య, బిడ్డ మృతితో

మెహిదీపట్నంకు చెందిన షాజహాన్‌బేగం తన కూతురు సారా మహమూద్‌తో కలిసి మక్కా యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. సారా మహమూద్‌ న్యాయవాది. ఆమె తల్లి షాజహాన్‌ బేగం గృహిణి. ఇద్దరూ బంధువులతో కలిసి యాత్రకు వెళ్లారు. భార్య, కుమార్తె మరణవార్త తెలిసి రోదిస్తున్న షేక్‌ మహబూబ్‌ను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు.


1.jpg

దంపతులు, కుమారుడి మృతి

బస్సు ప్రమాదంలో పాతబస్తీ వట్టేపల్లి ఫాతిమానగర్‌కు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మహ్మద్‌ మస్తాన్‌, కాలాపత్తర్‌ తాడ్‌బన్‌లో మోటర్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలున్నారు, ఈ నెల 9న మస్తాన్‌, ఆయన భార్య జకీయా బేగం, కుమారుడు మహమ్మద్‌ సోహైల్‌తో కలసి మక్కా యాత్రకు బయలుదేరారు. అక్కడ జరిగిన ప్రమాదంలో ముగ్గురూ చనిపోయారు.

ఇద్దరు తల్లీకొడుకులు..

బస్సు ప్రమాదంలో పాతబస్తీ మిస్రీగంజ్‌కు చెందిన ఇద్దరు తల్లీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. సారా బేగం (60), ఆమె కుమారుడు మహమ్మద్‌ సలీంఖాన్‌(42) ఓ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్ళారు. మహమ్మద్‌ సలీంఖాన్‌ ఫంక్షన్లలో డెకరేషన్‌ పనులు చేస్తుంటాడు. తల్లి సారాబేగం గృహిణి, సలీంఖాన్‌కు భార్య అంజుమ్‌ఖాన్‌, ఇద్దరు కుమారులు రెహాన్‌ఖాన్‌, ఫైజాన్‌ఖాన్‌ ఉన్నారు. తల్లీకొడుకుల మరణవార్త తెలుసుకున్న స్థానికులు బాధితుల ఇంటికి వచ్చి ఓదార్చారు.


2.jpg

ఒకే ఒక్కడు బయటపడ్డాడు

కుటుంబసభ్యుల్లో ముగ్గురు మంటల్లో కాలిపోతే.. ఆయనొక్కరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆసి్‌ఫనగర్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌, ఆయన భార్య గౌసియా బేగం, ఆమె తండ్రి మహ్మద్‌ మౌలానా, కుమారుడు మహ్మద్‌ షోయబ్‌, మక్కా యాత్రకు వెళ్లారు. ప్రమాదం వేళ షోయబ్‌ మాత్రం బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఆయనకు స్వల్పగాయాలయ్యాయి. అతడి కుటుంబ సభ్యులందరూ మృతి చెందారు.

తల్లి, ఇద్దరు కుమారుల మృతి

‘‘హాయ్‌... అమ్మీని తీసుకొని వస్తున్నాను... దుబాయ్‌లో కలుద్దాం అక్కడి నుంచి ఉమ్రా, మదీనా వెళ్దాం’’ అంటూ సోదరుడికి చెప్పి తల్లిని వెంటబెట్టుకొని వెళ్లారా ఐటీ ఉద్యోగి! బస్సు ప్రమాదంలో తన సోదరుడు, తల్లితో పాటు ఆయనా మృత్యుపాలయ్యారు. టోలిచౌకికి చెందిన సైఫ్‌ఉర్‌ రెహమాన్‌ కొంతకాలంగా దుబాయ్‌లో పనిచేస్తున్నారు. ఆయన సోదరుడు మహమ్మద్‌ షోయబ్‌ రెహమాన్‌ నగరంలో ఐటీ ఉద్యోగి. తల్లి రహీయత్‌ బేగం ఆయన వద్దే ఉంటోంది. హజ్‌ యాత్ర ప్రారంభం కావడంతో మక్కాకు వెళ్లి దర్శనం చేసుకోవాలనుకున్నారు. దుబాయ్‌కి రండి కలిసి వెళ్దామని సైఫ్‌ఉర్‌ వీరికి సూచించాడు. నేరుగా ఉమ్రాకు వస్తామని, దుబాయ్‌ నుంచి నువ్వు కుడా అక్కడికి రావాలని చెప్పారు. ఉమ్రాలో తల్లి, ఇద్దరు కొడుకులు కలుసుకొని అక్కడి నుంచి వచ్చిన హైదరాబాద్‌ టూర్‌ ప్యాకేజీలో చేరారు. అంతలోనే జరిగిన ప్రమాదంలో సోదరులు ఇద్దరూ తల్లితో సహా అగ్నికి ఆహుతయ్యారు.

Updated Date - Nov 18 , 2025 | 06:23 AM