Share News

Lost in Rath Yatra: ఆహ్వానిస్తే సరదాగా వెళ్లి.. మృతుల్లో ముగ్గురు స్నేహితులు

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:15 AM

భక్తిశ్రద్ధలతో రథయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తమవారు విగతజీవులుగా వాకిళ్లలోకి చేరడాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Lost in Rath Yatra: ఆహ్వానిస్తే సరదాగా వెళ్లి.. మృతుల్లో ముగ్గురు స్నేహితులు

  • ఒకరికి ఆరు నెలల పాప

  • మరొకరు తల్లిదండ్రులకు ఏకైక సంతానం

రామంతాపూర్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): భక్తిశ్రద్ధలతో రథయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తమవారు విగతజీవులుగా వాకిళ్లలోకి చేరడాన్ని ఆ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుల కుటుంబీకుల్లో ఎవ్వరిని కదిలించినా కన్నీళ్లే తప్ప మాటలు రావడం లేదు. మృతుల్లో శ్రీకాంత్‌ రెడ్డి, రాజేంద్రరెడ్డి, రుద్ర వికాస్‌ మంచి స్నేహితులు. రథయాత్ర నిర్వాహకుడు రవీందర్‌ యాదవ్‌తో శ్రీకాంత్‌ రెడ్డికి స్నేహం ఉంది. రవీందర్‌ ఆహ్వానించడంతో రథయాత్రకు శ్రీకాంత్‌ రెడ్డి.. తాను నిర్వహిస్తున్న హోటల్‌లో భాగస్వామి అయిన రాజేంద్రరెడ్డిని, మరో స్నేహితుడైన రుద్ర వికా్‌సను వెంటబెట్టుకొని వెళ్లాడు. శోభాయత్రకు వెళ్లిన ఈ ముగ్గురు స్నేహితులూ మృత్యువాత పడ్డారు. రాజేంద్రరెడ్డికి భార్య, బీటెక్‌ పూర్తిచేసిన కుమార్తె ఉంది. బిడ్డను మంచి ఉద్యోగంలో చేర్పించి, పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సిన తండ్రి అకాలమరణం చెందాడంటూ ఆప్తులు కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు. రుద్ర వికాస్‌ హబ్సిగూడ వీధి నంబర్‌-8లో స్టీల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడికి భార్య, ఎనిమిది, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులున్నారు. గణేశ్‌ ఉత్సవాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే రుద్రవికాస్‌.. వినాయక లడ్డూను ప్రతియేటా వేలంపాటలో తానే దక్కించుకునేవాడు. రథోత్సవం నిర్వాహకుడు రవీందర్‌ గాయాలపాలై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెండేళ్ల క్రితమే పెళ్లి..

మృతుడు సురేశ్‌ యాదవ్‌ స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నాడు. అతడికి రెండేళ్ల క్రితం పెళ్లయింది. సురేశ్‌ దంపతులకు ఆరు నెలల క్రితం పాప పుట్టింది. ఇక విద్యాదాఘాతంలో ఒక్కగానొక్క కొడుకు కృష్ణయాదవ్‌ మృత్యువాత పడటంతో గోకుల్‌నగర్‌ యాదవ సంఘం అధ్యక్షడు పింజర్ల రఘు యాదవ్‌ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రితో కలిసి పాలవ్యాపారం చేస్తున్న కృష్ణ.. తండ్రికి తగ్గ తనయుడు అన్నట్లుగా యాదవ సంఘంలో చురుగ్గా పాల్గొనేవాడు. స్థానికంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో ముందుండేవాడని స్థానికులు చెప్పారు. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే చెట్టంత కొడుకు మరలిరాని లోకాలకు వెళ్లాడంతో కన్నవారు షాక్‌కు గురయ్యారు. కిరాయి రథం వెంబడి పని చేసేందుకొచ్చిన గోల్నాక నివాసి గణేశ్‌.. విద్యుదాఘాతానికి గురై గాయాలపాలయ్యాడు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Aug 19 , 2025 | 05:15 AM