Family Tragedy: దీపావళి కోసం బయలుదేరి.. అనంత లోకాలకు!
ABN , Publish Date - Oct 20 , 2025 | 04:24 AM
కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న అక్కా తమ్ముళ్లు, ఓ చిన్నారి..
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
కుమరంభీం- ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కుటుంబంతో కలిసి దీపావళి పండుగ జరుపుకునేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతున్న అక్కా తమ్ముళ్లు, ఓ చిన్నారి.. రోడ్డు ప్రమాదంలో విగత జీవులైన ఘటన కుమరంభీం- అసిఫాబాద్ జిల్లాలో ఆదివారం జరిగింది. వాంకిడి మండలం బెండార గ్రామ వాసి చంద్రి జగన్ (27).. కాగజ్‌నగర్ మండలం వంజిరి గ్రామంలో ఉన్న తన అక్క డోంగ్రే అనసూయ (32), ఆమె పిల్లలు ప్రజ్ఞాశీల్ (6), హారికలను మోటారు సైకిల్‌పై తీసుకొస్తున్నాడు. చంద్రి జగన్ మోటారు సైకిల్‌ను అసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామ శివారులోని 363వ నంబర్ జాతీయ రహదారిపై గల ఫ్లైఓవర్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో జగన్, అనసూయ, ప్రజ్ఞాశీల్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన హారికను తొలుత అసిఫాబాద్ ఆస్పత్రిలో చేర్చగా, ప్రథమ చికిత్స తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ సంగతి తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరుతూ జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక సీఐ బాలాజీ వరప్రసాద్ బాధితులకు న్యాయం చేస్తానని నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.