Share News

Bike accident: గోతిలోకి బైకు.. ముగ్గురి దుర్మరణం!

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:22 AM

అర్ధరాత్రి ఒంటరిగా పంపడం సురక్షితం కాదని.. స్నేహితుడికి తోడుగా వెళ్లి ఇంటివద్ద దిగబెట్టిన ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం తమ ఇళ్లకు చేరలేదు...

Bike accident: గోతిలోకి బైకు.. ముగ్గురి దుర్మరణం!

  • సంగారెడ్డి జిల్లాలో ఘటన.. అంతా బంధువులే.. జిల్లాలోనే వేర్వేరు ప్రమాదాల్లో మరో ఇద్దరి మృతి

నారాయణఖేడ్‌/కంది, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి ఒంటరిగా పంపడం సురక్షితం కాదని.. స్నేహితుడికి తోడుగా వెళ్లి ఇంటివద్ద దిగబెట్టిన ఆ ముగ్గురు స్నేహితులు మాత్రం తమ ఇళ్లకు చేరలేదు. ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదవశాత్తు హైవే విస్తరణ కోసం తవ్విన గోతిలో పడి దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఎస్సై శ్రీశైలం, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణఖేడ్‌ మండలం నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఆవుటి నరసింహులు (27), జిన్న మల్లేశ్‌ (24), జిన్న మహేశ్‌ (23) శనివారం అర్ధరాత్రి పూట బంధువు సంతో్‌షను వదిలేందుకు రెండు ద్విచక్రవాహనాలపై నారాయణఖేడ్‌కు వచ్చారు. సంతో్‌షను నారాయణఖేడ్‌లో దింపాక ఒకే బైక్‌పై ముగ్గురు స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మరో ఐదు నిమిషాల్లో తమ గ్రామానికి చేరుకుంటారనగా వీరి బైక్‌ ప్రమాదానికి గురైంది. నిజాంపేట్‌-బీదర్‌ హైవేపై జూక్కల్‌ శివార్లలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సమీపంలో రోడ్డు విస్తరణలో భాగంగా వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలోకి బైక్‌ దూసుకెళ్లింది. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో మల్లేశ్‌, మహేశ్‌ అన్నదమ్ముల కుమారులు. మల్లేశ్‌ సోదరిని నరసింహులుకు ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదానికి జాతీయ రహదారి నిర్మాణం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌, అధికారుల నిర్లక్ష్యమే కారణం అని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదైంది. జిల్లాలోనే మరో రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి శివారులోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. కంది ఐఐటీ సమీపంలో లారీ ఢీకొనడంతో గుర్తు తెలియని పాదచారి మృతిచెందాడు.

Updated Date - Dec 29 , 2025 | 01:22 AM