Family Tragedy in Vikarabad: భార్యపై అనుమానంతో దారుణం
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:23 AM
వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను, చిన్న కుమార్తెను, వదినను నరికిచంపాడు...
ఆమెతో పాటు కూతురు, వదినను చంపి తాను ఆత్మహత్య
నిద్రిస్తున్న వారిపై కత్తితో ఘాతుకం
తప్పించుకున్న పెద్ద కూతురు
వికారాబాద్ జిల్లా కులకచర్లలో ఘటన
కులకచర్ల, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యపై అనుమానంతో ఆమెను, చిన్న కుమార్తెను, వదినను నరికిచంపాడు. పెద్ద కుమార్తె గాయాలతో తప్పించుకుని బయటపడింది. ఆపై ఆ వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య (38)కు పాలమూరు జిల్లా హన్వాడ మండలం పగిడ్యాల్‌కు చెందిన అలవేలు(34)తో 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి కుమార్తెలు అపర్ణ (13), శ్రావణి (10) ఉన్నారు. దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. యాదయ్య అలవేలుపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో తరచూ గొడవ పడుతుండేవారు. పెద్దల సమక్షంలో పంచాయి తీలు జరిగాయి. పోలీసు స్టేషన్ వరకు కూడా వెళ్లారు. శనివారం సాయంత్రం కూడా స్థానిక ఓ ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ జరగగా.. గొడవలు పడకుండా ఉండాలని ఆ ప్రజాప్రతినిధి నచ్చజెప్పి పంపించాడు. అయితే అనుమానంతో భార్యపైన, తమ మధ్య గొడవలో అడ్డు వస్తోందని వదిన (అలవేలు అక్క) హన్మమ్మ (40)పై యాదయ్య పగ పెంచుకున్నాడు. హన్మమ్మది కోస్గి మండలం బలభద్రయపల్లి గ్రామం. శనివారమే పంచాయితీ కోసం వచ్చింది. పంచాయితీలో హన్మమ్మ మాట్లాడిన తీరుపై యాదయ్య కోపంతో రగిలిపోయాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రి అందరూ కలిసి భోజనం చేసి పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో యాదయ్య నిద్రిస్తున్న హన్మమ్మపై తాటి ముంజెలు తీసే కత్తితో దాడి చేశాడు. దీంతో ఉలిక్కిపడి లేచిన భార్య, పిల్లలు అతడిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. తర్వాత యాదయ్య భార్యపైన, ఆపై చిన్నకూతురు శ్రావణిపైనా కత్తితో దాడి చేసి చంపాడు. పెద్ద కూతురు అపర్ణనూ చంపేందుకు ప్రయత్నించగా.. ఆమె గాయాలతో తప్పించుకుంది. గ్రామంలో ప్రభు అనే వ్యక్తి ఇంటికెళ్లి జరిగిన విషయం చెప్పింది. ప్రభు, అతని సోదరుడు పెంటయ్యను నిద్రలేపి యాదయ్య ఇంటికి వచ్చి చూడగా అప్పటికే హన్మమ్మ, అలవేలు, శ్రావణి రక్తపుమడుగులో నిర్జీవంగా పడి ఉన్నారు. యాదయ్య ఉరేసుకుని కనిపించాడు. యాదయ్య భార్యపై అనుమానంతో పాటు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, దాన్ని నిలదీసినందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. అలవేలు అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పాపం.. అపర్ణ
తల్లి, తండ్రి, పెద్దమ్మ, చెల్లిని కోల్పోయిన అపర్ణ అనాథగా మారింది. గాయపడిన ఆమె పరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అపర్ణ భవిష్యత్తు ఏమిటని, తల్లిదండ్రులు లేని లోటును ఎవరు తీరుస్తారని పలువురు కంటతడిపెట్టారు.