Telangana Local Elections: సీటుకు ముగ్గురు
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:11 AM
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల...
జడ్పీటీసీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా సిద్ధం చేయండి
ఆశావహుల గుణగణాలు, పరపతిని పరిశీలించండి
ఐదో తేదీ కల్లా టీపీసీసీకి జాబితాలు పంపండి
అర్హులైన అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుంది
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం
జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ల కంట్రోల్‌లో రిజర్వేషన్ల ఖరారు!
కొడంగల్ నుంచీ ఫిర్యాదులొచ్చాయి
ఈ విషయంలో ఏం చేయలేమని వ్యాఖ్య
ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీ స్థాయిలోనే
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో... ఒక్కో స్థానానికి ముగ్గురితో ప్రాథమికంగా ఓ జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నుంచి వచ్చిన ఆ జాబితాలను పరిశీలించి జడ్పీటీసీ అభ్యర్థిని టీపీసీసీ ఖరారు చేయనుంది. స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఇన్‌చార్జి మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సూచనలు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జడ్పీటీసీ స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాలని ఇన్‌చార్జి మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెల ఐదో తేదీ కల్లా ఆశావహుల జాబితాను సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఒక్కో స్థానానికి ముగ్గురు ఆశావహులతో జాబితాను రూపొందించి టీపీసీసీ అధ్యక్షునికి పంపాలని తెలిపారు. ఆ జాబితాలపై చర్చించిన తర్వాత టీపీసీసీనే అభ్యర్థిని నిర్ణయిస్తుందని వివరించారు. జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో వారి గుణగణాలు, అభ్యర్థులకు ప్రజల్లో ఉన్న పరపతి, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించారు. మంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే ఎన్నిక సాఫీగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అన్ని రకాలుగా అర్హులైన అభ్యర్థులనే పీసీసీ ఎంపిక చేస్తుందని, గెలుపే లక్ష్యంగా పని చేయాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కాగా, ఎంపీటీసీ అభ్యర్థులను స్థానికంగా డీసీసీ స్థాయిలోనే ఎంపిక చేయాల్సి ఉంటుందని కాంగ్రెస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ ఏకగ్రీవం కాకపోతే అభ్యర్థుల జాబితాను పీసీసీకి పంపించాలని సూచించినట్టు సమాచారం
అంతా కంప్యూటర్ కంట్రోల్‌లోనే..!
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు అంతా కంప్యూటర్ కంట్రోల్‌లోనే జరిగిందని, ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయలేమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. పలు గ్రామాలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు సరిగా జరగలేదనే అంశాన్ని పలువురు మంత్రులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకురాగా ఆయన ఈ మేరకు స్పందించినట్టు సమాచారం. కొడంగల్ నియోజకవర్గం నుంచీ తనకు ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయని సీఎం వారితో అన్నట్లు తెలిసింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జనాభా ప్రాతిపదికన కంప్యూటర్ కంట్రోల్‌లో రిజర్వేషన్ల ఖరారు జరిగినట్లు సీఎం వారికి చెప్పినట్లు సమాచారం.
నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా కోడ్ దెబ్బ
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి మరింత సమయం పట్టనుంది. జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ సోమవారం నుంచి అమలులోకి రావడమే ఇందుకు కారణం. కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం పదవులు భర్తీ చేసే వీలు ఉండదు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ నాయకుల ఆశలపై ఎన్నికల కోడ్ నీళ్లు చల్లినట్టు అయింది. నిజానికి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం భారీ కసరత్తే చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్ ఆయా పదవుల భర్తీపై పలుమార్లు సమావేశం కూడా అయ్యారు. ఇక, పదవులను ప్రకటించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్నికల కోడ్ నవంబరు 11 వరకూ కొనసాగనుంది. పరిషత్, పంచాయతీల ఎన్నికలు సజావుగా జరిగితే వెంటనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. అదే జరిగితే పరిషత్, పంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు రెండు నెలలు సమయం తీసుకున్నా..
ఈ ఏడాది ముగిసే వరకూ కోడ్ కొనసాగే అవకాశముంది. అంటే ఈ ఏడాదిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉండదు. మరోపక్క, జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీ కాలం జనవరిలో పూర్తి కానుండడంతో ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తే.. పదవులు దక్కని వారి నుంచి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ నామినేటెడ్ పదవుల భర్తీ ఉండదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయితే.. పార్టీ నాయకులు వేల మందికి పదవులు లభిస్తాయని, ఇప్పటికే నామినేటెడ్ పదవులు పొందిన వారి పదవీ కాలమూ పూర్తి కావవస్తుందని అంటున్నారు. దాంతో ఎన్నికల అనంతరం పార్టీ పెద్దలు మరోసారి భేటీ అయ్యి... అప్పటిదాకా పదవులు పొందని నేతలకు న్యాయం చేస్తారని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాగా, స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. డీసీసీ అధ్యక్షుల ఎంపికకు ఏఐసీసీ ఇటీవల పరిశీలకులను నియమించింది. షెడ్యూల్ ప్రకారం ఆ పరిశీలకులు ఈ నెల 4నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించాలి. కానీ, స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికలు ముగిసే వరకూ డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ వాయిదా వేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.