Share News

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:44 AM

హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి నల్లగొండకు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాఘవరావు

నల్లగొండ క్రైం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి నల్లగొండకు గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నల్లగొండలోని పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టూటౌన్‌ సీఐ రాఘవరావు కేసు వివరాలు వెల్లడించారు. నల్లగొండ పట్టణానికి చెందిన పెరిక కరుణ జయరాజు, శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన వెల్లెంల శివశంకర్‌, వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన పెద్దమాము వీరస్వాములు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్నా రు. కరుణ జయరాజు కొన్నాళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ చేస్తున్నాడు. వ్యాపారంలో భాగంగా శివశంకర్‌, వీరస్వామితో స్నేహం ఏర్పడింది. వీరు రెండేళ్లుగా గంజాయికి అలవాటు పడి హైదరాబాద్‌లోని ధూల్‌పేట నుంచి కొనుగోలు చేసేవారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆరు నెలలుగా కరుణజయరాజు పెట్టుబడి పెట్టి శివ శంకర్‌ను హైదరాబాద్‌కు పంపేవాడని, అతడు కిలోకు రూ.10 వేలు వెచ్చించి కొనుగోలు చేసుకొని రాగా వీరు ముగ్గురు కలిసి వాటిని చిన్నప్యాకెట్లుగా చేసి వాటిని ఒక్కొక్క ప్యాకెట్‌ను రూ.500లకు విక్రయించేవారు. ఈ నెల 14వ తేదీన సోమవారం ఉదయం వీరు ముగ్గురు కలిసి గంజాయిని చిన్న ప్యాకెట్‌లుగా తయారు చేస్తుండగా పోలీసులకు సమాచారం అందింది. వారిని అరెస్టు చేసి గంజాయితో పాటు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి రూ.40వేలు విలువైన కిలోన్నర గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో నల్లగొండ టూటౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవరావు ఆధ్వర్యంలో నేరస్తులను పట్టుకున్న టూటౌన్‌ ఎస్‌ఐ వై.సైదులు, సిబ్బంది పాయిల్‌ రాజు, బాలకోటిలను ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అభినందించారు.

Updated Date - Jul 15 , 2025 | 12:44 AM