Share News

Third Phase of Panchayat Elections: మూడోసారీ అదే పంచాయతీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 03:18 AM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల అంకం దాదాపుగా ముగిసింది. మూడో విడత ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి

Third Phase of Panchayat Elections: మూడోసారీ అదే పంచాయతీ

  • పోలింగ్‌కు ముందు రాత్రి ఘర్షణలు

  • తాము పంచిన డబ్బులు తిరిగివ్వాలంటూ

  • ఓటర్ల వెంటపడుతున్న కొందరు ఓడిన అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల అంకం దాదాపుగా ముగిసింది. మూడో విడత ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు రాత్రి ఘర్షణల నుంచి ఓటమి తర్వాత తమ డబ్బులు తమకు తిరిగి ఇవ్వాలంటూ కొందరు అభ్యర్థులు ఓటర్లను వెంటాడటం దాకా సిత్రాలెన్నో జరిగాయి. ఒక్క ఓటు విజయాలు, టాస్‌తో మారిన అభ్యర్థుల తలరాతలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు వంటివెన్నో చోటు చేసుకున్నాయి. ఒక్క ఓటు కూడా ముఖ్యమైనదేనంటూ.. కదల్లేని వృద్ధులను మంచాల్లో, మూడు చక్రాల సైకిళ్లలో, ఆటోల్లో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువచ్చి ఓట్లు వేయించడం కనిపించింది.

ఓటు విలువను చాటేందుకు..

సంగారెడ్డి జిల్లా మానూరుకు చెందిన ఆవుటి మల్లన్న సైన్యంలో పనిచేసి రిటైరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన ఓటు విలువ చాటేందుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించి స్వగ్రామానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం మానూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • వికారాబాద్‌ జిల్లా కులకచర్ల మండలం బండవెల్కిచర్లకు చెందిన సిద్దోటం నవీన్‌కుమార్‌ ఐర్లాండ్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చి బుధవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం హోతా తండాలో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లురాగా, అధికారులు టాస్‌ వేశారు. కాంగ్రెస్‌ మద్దతుదారు రంగీబాయిని విజయం వరించింది.


3.jpg

జగన్‌ ఓటమి.. చంద్రబాబు సర్పంచ్‌!

పోటాపోటీగా ఓట్ల లెక్కింపు జరిగింది.. జగన్‌పై చంద్రబాబు వంద ఓట్ల మెజారిటీతో గెలిచారు.. దర్జాగా సర్పంచ్‌ అయ్యారు.. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ ఏమిటి? సర్పంచ్‌ పదవికి పోటీపడటమేమిటి? చిత్రంగా అనిపిస్తోందా? కానీ వంద శాతం నిజం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవులో సర్పంచ్‌ పదవి కోసం భూక్యా చంద్రబాబు, బానోత్‌ జగన్‌ అలియాస్‌ జగన్నాథం తలపడ్డారు. మొత్తం 866 ఓట్లు పోలవగా చంద్రబాబుకు 480, జగన్‌కు 380 ఓట్లు వచ్చాయి. దీనితో జగన్‌పై చంద్రబాబు విజయం అంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీవారే కావడం మరో విశేషం.

ప్రచారంలో వెనుకబడ్డానని.. పురుగుల మందు తాగి..

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలోని రాస్పెల్లిలో సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న బీఆర్‌ఎస్‌ మద్దతుదారు బొమ్మెల రాజయ్య బుధవారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎన్నికల ప్రచారం, ఖర్చుల కోసంరాజయ్య తన పొలాన్ని విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యక్తి మంగళవారం రాత్రి వరకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో.. ప్రచారంలో వెనుకబడిపోయానని రాజయ్య మనస్తాపం చెందారు. బుధవారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగారు. మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


1.jpg

ఈ పంచాయతీకి 70ఏళ్లలో తొలిసారి ఎన్నిక

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్‌ గ్రామంలో సుమారు 70 ఏళ్లుగా సర్పంచ్‌, వార్డు మెంబర్‌ పదవులు ఏకగ్రీవం అవుతూనే వచ్చాయి. ఇప్పుడు తొలిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. బరంపూర్‌ జెడ్పీ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో 80 ఏళ్ల బోలపతి భూమన్న తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు.

ఓటేయలే.. డబ్బులిచ్చేయండి..

పోలింగ్‌కు ముందు వరకు ఓటర్లకు డబ్బులు పంచిన అభ్యర్థుల్లో కొందరు.. తాము ఓటమిపాలు కావడంతో తిరిగి వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా పోటీచేసి ఓడిన అభ్యర్థి భర్త.. తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టారు. డబ్బులు తిరిగి ఇవ్వకుంటే వారి పేర్లతో ప్రతిరోజూ వాట్సాప్‌ స్టేటస్‌ పెడతానని హెచ్చరిక పెట్టారు. కాగా, రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం సంగెంలో యెన్నం వినయ్‌రెడ్డి తన సొంత ఖర్చులతో గ్రామ పంచాయతీ వద్ద ఆర్వో తాగునీటి ప్లాంటును ఏర్పాటు చేశారు. తాజా సర్పంచ్‌ ఎన్నికల్లో తమ పార్టీ కాంగ్రెస్‌ మద్దతుదారు తరఫున ఆయన ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్‌ మద్దతుదారు ఓడిపోవడంతో ఆగ్రహించి వాటర్‌ ప్లాంట్‌ను విప్పి తీసుకెళ్లిపోయారు.

2.jpg

ట్రాఫిక్‌ ‘పంచాయతీ’

మూడో దశ పంచాయతీ పోలింగ్‌ నేపథ్యంలో బుధవారం ఉదయం చాలా మంది హైదరాబాద్‌ నుంచి స్వగ్రామాలకు బయలుదేరారు. దీనితో 161 జాతీయ రహదారిపై సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం తాడ్దానిపల్లి శివారులో టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Updated Date - Dec 18 , 2025 | 03:18 AM