Share News

kumaram bheem asifabad- ముగిసిన మూడో విడత నామినేషన్లు

ABN , Publish Date - Dec 05 , 2025 | 10:47 PM

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శుక్రవారం మూడో విడత సర్పంచ్‌, వార్డు స్థానాల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. మూడో విడతలో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్‌ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. బుధ, గురువారల్లో ఆయా మండలాల పరిధిలో మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 226, వార్డు స్థానాలకు 711 నామినేషన్లు దాఖలయ్యాయి.

kumaram bheem asifabad- ముగిసిన మూడో విడత నామినేషన్లు
భట్టుపల్లి పోలింగ్‌ కేంద్రం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

ఆసిపాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శుక్రవారం మూడో విడత సర్పంచ్‌, వార్డు స్థానాల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. మూడో విడతలో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, రెబ్బన, తిర్యాణి మండలాల్లోని 108 సర్పంచ్‌ స్థానాలకు, 938 వార్డు స్థానాలకు నామినేషన్లను స్వీకరించారు. బుధ, గురువారల్లో ఆయా మండలాల పరిధిలో మొత్తం సర్పంచ్‌ స్థానాలకు 226, వార్డు స్థానాలకు 711 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. దాఖలైన నామినేషన్లను శనివారం అధికారులు పరిశీలించనున్నారు. డిసెంబరు 9న నామినేషన్ల ఉపసంహర ణకు గడువు ఉంది. డిసెంబరు 17న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయా మండలాల పరిధిలోని సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.

కాగజ్‌నగర్‌, (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కాగజ్‌గర్‌ మండలంలో 28 గ్రామ పంచాయతీలుండగా సర్పంచి బరిలో ఉండే అభ్యర్థులు, వార్డు సభ్యులు తమ నామినేషన్లను సంబంధిత క్లసర్‌ అధికారులకు అందజేశారు. చివరి రోజు కావటంతో ఉదయం 10 గంటల నుంచి పోలీసుల గట్టి బందోబస్తు నిర్వహించారు. ఐదు గంటల వరకు క్లస్టర్‌ గేట్లను మూసివేసి లోపల ఉన్న అభ్యర్థుల ద్వారా దరఖాస్తులు తీసుకున్నారు. రాత్రి 8 గంటల వరకు కూడా నామినేషన్లను అధికారులు తీసుకున్నారు. భట్టుపల్లి, వంజీరి, నజ్రూల్‌నగర్‌ క్యాంపుల్లో రాత్రి 8 గంటల వరకు కూడా కొనసాగింది. చివరి రోజు అధిక నామినేషన్లు రానున్న నేపథ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రం వద్ద పికెటింగ్‌ నిర్వహించారు. గుంపులు గుంపులు లేకుండా చర్యలు తీసుకున్నారు. డీఎస్పీ, రూరల్‌ సీఐ ఆధ్వర్యంలో ఎస్సై, సిబ్బంది గట్టి బందోబస్తు చేపట్టారు.

Updated Date - Dec 05 , 2025 | 10:47 PM