Kokapet Land Auction Concludes: కోకాపేటలో మూడో విడత భూముల వేలం పూర్తి
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:15 AM
కోకాపేట నియోపోలీ్‌సలో మూడో విడత భూముల వేలం ప్రక్రియ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ విడతలో ఎకరం సగటు ధర రూ.137..36 కోట్లు పలకడం విశేషం....
ఎకరం సగటు ధర రూ. 137 కోట్లు
27 ఎకరాలకు రూ.3700 కోట్ల ఆదాయం
రెండు సంవత్సరాల్లో 87ు అసాధారణ వృద్ధి
డిసెంబరు 5న చివరి విడత భూముల వేలం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కోకాపేట నియోపోలీ్‌సలో మూడో విడత భూముల వేలం ప్రక్రియ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ విడతలో ఎకరం సగటు ధర రూ.137..36 కోట్లు పలకడం విశేషం. ప్లాట్ నంబరు 19, 20లోని మొత్తం 8.04ఎకరాల భూమిని అమ్మడం ద్వారా హెచ్‌ఎండీఏకు సుమారు రూ.1000కోట్ల ఆదాయం సమకూరింది. నియోపోలీస్ లే అవుట్‌లో మొత్తం మూడు విడతల్లో జరిగిన వేలంలో.. 27 ఎకరాల విస్తీర్ణంలోని 6 ప్లాట్లను విక్రయించడం ద్వారా హెచ్ ఎండీఏ రూ.3708 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ప్లాట్ నెంబరు 19లో నాలుగెకరాలకు గాను, ఎకరా రూ. 131కోట్లకు యోలా కన్‌స్ట్రక్షన్స్ ఎల్‌ఎల్పీ, గ్లోబస్ ఇన్ఫాక్రాన్ ఎల్‌ఎల్పీ సంస్థలు దక్కించుకున్నాయి. ప్లాట్ నెం.20లోని మరో నాలుగెకరాల భూమిని బ్రిగేడ్ ఎంటర్‌పైజ్రెస్ లిమిటెడ్ ఎకరాకు రూ. 118 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ ప్లాట్లు పశ్చిమం వైపు ఉండడంతో మూడు రోజుల క్రితం జరిగిన వేలంతో పోలిస్తే ధరలు స్వల్పంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ 28న జరిగిన రెండో విడతలో రికార్డు స్థాయిలో ఎకరం ధర రూ. 151 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఇదే నియో పోలీస్ లేఔట్‌లో జరిగిన వేలం ధరలతో పోలిస్తే.. ఏకంగా 87శాతం అసాధారణ వృద్ధిని నమోదు చేయడం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కోకాపేట ప్రాధాన్యాన్ని మరోసారి స్పష్టం చేసింది. అప్పుడు ఎకరా రూ.100 కోట్లు పలకగా.. సగటు ధర రూ.73 కోట్లుగా ఖరారు అయింది. అయితే కోకాపేటలోని గోల్డెన్ మైల్ లే అవుట్‌లో రెండు ఎకరాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ శుక్రవారం చివరి విడత వేలం వేయనుంది. ఈ స్థలానికి ఎకరం కనీస ధర రూ.75 కోట్లు నిర్ణయించగా.. ఏ మేరకు ధర పలుకుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.