Thieves Return Stolen Donation Money: చోరీ సొత్తు ఆలయంలో ప్రత్యక్షం
ABN , Publish Date - Sep 06 , 2025 | 03:27 AM
ఆలయాల్లో హుండీ చోరీలు జరగడం చూస్తుంటాం. కానీ చోరీ చేసిన సొత్తును తిరిగి ఆలయంలోనే వదిలిపెట్టిన ఘటనలు ఎక్కడా చూసి ఉండం! కానీ..
అమ్మవారికి క్షమాపణ కోరుతూ దొంగల లేఖ
బుక్కరాయసముద్రం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో హుండీ చోరీలు జరగడం చూస్తుంటాం. కానీ చోరీ చేసిన సొత్తును తిరిగి ఆలయంలోనే వదిలిపెట్టిన ఘటనలు ఎక్కడా చూసి ఉండం! కానీ.. ఏపీలోని అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం మండల కేంద్రంలోని ముసలమ్మ కట్ట ఆలయంలో జూలై 21న చోరీ చేసిన హుండీ సొమ్మును దొంగలు 45రోజుల తర్వాత అక్కడే పడేసి వెళ్లారు. డబ్బు మూటతోపాటు అమ్మవారిని క్షమాపణ కోరుతూ ఓ లేఖను రాసిపెట్టారు. పూజారి రాఘవయ్య శుక్రవారం తెల్లవారు జామున ఆలయం తలుపులు తెరిచాక ఈ డబ్బుమూటను గుర్తించారు. పోలీసుల సమక్షంలో సొమ్మును లెక్కించారు. ఆ మూటలో రూ.1,86,400 ఉన్నట్లు గుర్తించారు. లేఖలో.. ‘క్షమించు తల్లీ.. నలుగురం కలిసి దొంగతనం చేశాం. అప్పటి నుంచి నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు. పరిస్థితి విషమంగా ఉంది. దొంగతనం చేసిన సొమ్ములో కొంత ఆస్పత్రి ఖర్చులకు వాడుకున్నాం..’ అని వచ్చీ రాని తెలుగులో రాసిన ఓ లేఖను మూటలో ఉంచారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నాయి. దీంతో ప్రహరీ బయటి నుంచి ఆలయం లోపలికి డబ్బు మూటను విసిరేశారు. గురువారం అర్ధరాత్రి, లేదా శుక్రవారం తెల్లవారు జామున విసిరేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.